చిలకలూరిపేట సభలో ప్రధాని నరేంద్రమోడీ ఒక గొప్ప పోలిక తెచ్చారు. కోటప్పకొండ దేవుని సమీపంలో నిర్వహిస్తున్న ఈ సభకు హాజరైన జనసందోహాన్ని గమనిస్తోంటే.. తనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తుల ఆశీస్సులు లభించాయనేంత ఉత్సాహం కలుగుతోందని ఆయన అన్నారు. ఆ త్రిమూర్తుల ఆశీర్వాదంతో.. వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ప్రధాని మోడీకి అక్కడి సభాకు హాజరైన జనంలో త్రిమూర్తుల ఆశీస్సులు కనిపిస్తే.. ఆ జనానికి మాత్రం వేదిక మీద త్రిమూర్తులే ఆసీనులైనట్టుగా కనిపించిందే.
ఏపీ రాష్ట్రంలో దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మట్టుపెట్టడానికి త్రిమూర్తులే కలసికట్టుగా దండెత్తుతున్నట్టుగా ప్రజలు భావించారు.
సృష్టి కారకుడైన బ్రహ్మ స్వరూపంగా- ప్రధాని నరేంద్రమోడీ
స్థితి కారకుడైన, రక్షకుడైన విష్ణు స్వరూపంగా- నారా చంద్రబాబునాయుడు
లయ కారకుడైన, దుర్మార్గుల పీచమణిచే శివ స్వరూపంగా- పవన్ కల్యాణ్
ముగ్గురూ కలిసి ఒకే వేదిక మీద కూర్చుని.. జగన్ దుర్మార్గపు, అవినీతిమయమైన పాలనను అంతమొందించడానికి కంకణ బద్ధులు అయినట్టుగా ప్రజలు భావించారు. దానికి తగ్గట్టుగానే ఆ ముగ్గురు నాయకులు కూడా జగన్ సర్కారు మీద విరుచుకు పడ్డారు.
ప్రధాని మోడీ.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలోని మంత్రులు ఒకరితో మరొకరు పోటీపడి అవినీతి చేయడంలో చెలరేగిపోతున్నారని, అలాంటి అవినీతిమయమైన పాలకులను ఇంటికి పంపాలని ఆయన పిలుపు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని ఆయన సొంత చెల్లెళ్లే చెబుతున్నారని, ఆ పార్టీ పునాదులే జగన్ బాబాయి నెత్తురుతో తడిసిన సంగతిని కూడా వారే చెబుతున్నారని అంటూ చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. తమ మూడు పార్టీల జెండాలు వేరువేరు అయినప్పటికీ.. తమ అందరి ఎజెండా సంక్షేమం, అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. అచ్చంగా, స్థితి కారకుడైన విష్ణమూర్తి స్వరూపంలాగా.. ‘‘మీ జీవితాలను తీర్చదిద్దే బాధ్యత మాది.. మీ ఆశీర్వాదం మాకు కావాలి’’ అని చంద్రబాబు సెలవిచ్చారు.
పవన్ కల్యాణ్ ఫోకస్ పూర్తిగా జగన్ సర్కారును తుదముట్టించడం మీదనే సాగింది. ‘‘ధీరులు శూరులు మందీమార్బలం ఉన్నారని, ఎవరేం చేయగలరని రావణాసురుడు కూడా విర్రవీగాడని.. నారవస్త్రాలు ధరించి, నేలమీద నిలబడిన శ్రీరాముడు బాణంతో రావణుడిని సంహరించారని అన్నారు. అయోధ్యకు రాముడిని తీసుకువచ్చిన మోదీ ఇక్కడుంటే .. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన ఈ చిటికెన వేలంత రావణాసురుడిని గద్దెదించడం కష్టమా’’ అని అన్నారు.
ఈ ముగ్గురు నాయకులూ త్రిమూర్తుల్లా వేదిక మీద ఉన్నారని ప్రజలు అనుకుంటే.. ఆ ముగ్గురు నాయకుల ప్రసంగాలు కూడా త్రిమూర్తుల తత్వానికి తగ్గట్టుగానే సాగడం విశేషం.