ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నామినేటెడ్ పోస్టుల పందేరం ఇంకా ప్రారంభించనే లేదు. నిజం చెప్పాలంటే.. నామినేటెడ్ పందేరం మీద దృష్టి సారించడానికి ఆయనకు ఇప్పటిదాకా ఖాళీ కూడా దొరకలేదు. అయిదేళ్ల పాటూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రకరకాల వేధింపులు భరిస్తూ కూడా పార్టీని నమ్ముకుని, పార్టీకి అండగా ఉండిన పార్టీ శ్రేణులు ఇప్పుడు ఆవురావురా అని ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్ని ఎప్పుడు పంచిపెడతారా అని నిరీక్షిస్తున్నారు. అలాంటి వారికి.. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాటలు గొప్ప ఊరట ఇస్తున్నాయి. వారిలో ఆశల్ని మొలకెత్తిస్తున్నాయి.
ఆనం రామనారాయణ రెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల ధర్మకర్తల మండళ్లను నియమించడం త్వరలోనే పూర్తవుతుందని సెలవిచ్చారు. నిజానికి నామినేటెడ్ పోస్టుల పందేరంలో దేవాలయాల పాలక మండలులదే అగ్రస్థానం! ఏపీలో ఉన్న అన్ని పదవుల కంటె టీటీడీ ఛైర్మన్ పదవి చాలా పెద్దది అనే సంగతి అందరికీ తెలుసు. టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవిని కూడా మంత్రి పదవితో సమానంగా నాయకులు చూస్తుంటారు. అలాంటిది.. టీటీడీ ఛైర్మన్ గా అశోక్ గజపతి రాజు అనే ప్రచారం బాగా జరిగింది గానీ.. ఆయన వద్దన్నట్టుగా సమాచారం.
కానీ, ఆనం రామనారాయణ రెడ్డి త్వరలోనే నామినెటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనగానే పార్టీ శ్రేణులన్నీ ఉత్సాహపడుతున్నాయి. ఇప్పటికే తమ తమ ఎమ్మెల్యేల ద్వారా.. ఉన్న పదవుల కోసం, పాలకమండలుల్లో స్థానం కోసం పైరవీలు ప్రారంభించేశారు. ఇప్పుడు ఆనం ప్రకటన కూడా వచ్చిన తర్వాత.. వారి జోరు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే.. త్వరలోనే పాలకమండలులను చేస్తే గనుక.. అది చంద్రబాబు తీరుకు భిన్నంగా చేసినట్టు అవుతుంది. బాబు ఈసారి పార్టీ కార్యకర్తలు గరిష్టంగా ప్రయోజనం పొందేలా చూడాలని శ్రేణులు కోరుకుంటున్నాయి.