జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజోలునుంచి రాపాక వరప్రసాద్. ఎన్నికలు పూర్తయిన కేవలం కొన్ని రోజులకే ఆయన పార్టీ ఫిరాయించేశారు. జగన్ పంచన చేరారు. తాను గెలిచింది పవన్ కల్యాణ్ వల్ల కాదంటూ డైలాగులు వల్లించారు. స్థానికంగా వైఎస్సార్ పార్టీ కార్యకర్తలతో ఆయనకు అనేక చికాకులు ఎదురవుతూ ఉన్నప్పటకీ.. అవకాశవాద ధోరణితో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు. అలాంటి రాపాక వరప్రసాద్ కు ఇప్పుడు నోట్లో మన్ను పడింది. ఆయనేమో రాజోలు ఎమ్మెల్యేగానే మళ్లీ పోటీచేయాలని చాలా బలంగా కోరుకుంటూ ఉండగా.. జగన్ మాత్రం ఆయనను అమలాపురం ఎంపీ నియోజకవర్గానికి ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి మూడోస్థానంలో నిలిచిన గొల్లపల్లి సూర్యారావును తమ పార్టీలో చేర్చుకుని ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు.
జగన్ నిర్ణయం రాపాక వరప్రసాద్ కు షాక్ అని ఆయన వర్గీయులు చెబుతున్నారు. జనసేన పార్టీ తరఫున గెలిచినప్పటికీ.. ఆ పార్టీ తరఫున శాసనసభలో గళం వినిపించే ఒకే ఒక గొంతుక అయినప్పటికీ.. రాపాక , పవన్ కల్యాణ్ ను మోసం చేశారు. శాసనసభలో జనసేన అస్తిత్వమే లేకుండా పార్టీ ఫిరాయించారు. జగన్ పంచన చేరి ఆయన వ్యక్తిగతంగా లబ్ధి పొందడం తప్ప నియోజకవర్గంలో ఆయనకు దక్కిన గౌరవం ఎంతమాత్రమూ లేదు. స్థానికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా చికాకు పెడుతూ ఉండడంతో.. పార్టీలో చేరినా కూడా ఈ ఇబ్బందులేంటని ఆయన సభాముఖంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాగని రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన బలం ఉన్నదా? అంటే అలా కూడా అవకాశం లేదు. నిజానికి ఆ నియోజకవర్గంలో పోటీచేయించడానికి సరైన సొంత అభ్యర్థి కూడా ఆ పార్టీకి లేరు. అయినా సరే.. సిటింగ్ ఎమ్మెల్యేగా అక్కడ తనకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్న రాపాక వరప్రసాద్ విజ్ఞప్తిని వారు తోసిపుచ్చారు. తెలుగుదేశం నుంచి ఫిరాయించి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇప్పుడు అభ్యర్థిత్వం కట్టబెట్టారు.
రాపాక వరప్రసాద్.. పవన్ కల్యాణ్ హవాను కూడా వాడుకుంటూ గతంలో రాజోలు ఎమ్మెల్యేగా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా.. 814 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాంటి నాయకుడు ఇప్పుడు అమలాపురం ఎంపీగా పోటీచేయడం అంటే ఆయన పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడినట్టే. జగన్ విపరీతపోకడల నిర్ణయాల కారణంగా తమ నాయకుడికి ద్రోహం జరిగిందని రాపాక అనుచరులు ఇప్పుడు గొల్లుమంటున్నారు.