పవన్ గుడ్ డెసిషన్ : తెదేపా సీనియర్ కు నో టెన్షన్!

తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు గురించిన ఒక టెన్షన్ తీరిపోయింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ గణనీయమైన బలం చూపించినప్పటికీ.. దానికి ఎదురొడ్డి గెలుచుకున్న రాజమండ్రి రూరల్ సీటు.. అయిదేళ్లు గడిచేసరికి తనకు కాకుండా పోతుందా అనే భయం ఆయనను వీడిపోయింది. తెలుగుదేశం గత ఎన్నికల్లో గెలుచుకున్న సిటింగు సీట్లను కూడా జనసేన పొత్తుల్లో భాగంగా అడగడం ద్వారా రాజకీయ ధర్మం మీరి వ్యవహరిస్తున్నదనే చెడ్డపేరు లేకుండాపోయింది. గతంలో గెలిచిన సిటింగ్ సీట్లను కూడా పొత్తు కోసం పణంగా పెట్టేస్తూ.. తెలుగుదేశం సొంత పార్టీనేతలకు అన్యాయం చేస్తున్నదనే మాట రాకుండా పోయింది. అవును- ఈ పరిణామాలు అన్నీ కూడా జనసేనాని పవన్ కల్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ద్వారా సాధ్యం అయ్యాయి. ఇంతకూ ఆ నిర్ణయం ఏంటో తెలుసా- జనసేన పార్టీకి గోదావరి జిల్లాల్లో కీలక నాయకుడు కందుల దుర్గేష్ ను నిడదవోలు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించుతున్నట్టుగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం.
అవును- కందుల దుర్గేష్ కు నిడదవోలు కేటాయించడం ద్వారా ఇరు పార్టీల పొత్తుల్లో ఏర్పడిన ఒక ప్రతిష్ఠంభన తొలగిపోయింది. కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే అక్కడినుంచి 2019లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. ఎంతో సీనియర్ అయిన ఆయన రాజకీయ రిటైర్మెంట్ కోరుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు గానీ.. ఆయన కూడా కొనసాగాలనుకున్నారు. ఈలోగా నియోజకవర్గంనుంచి పోటీచేయబోయేది నేనే నని దుర్గేష్ తనంత తాను ప్రకటించుకోవడం, అలా ప్రకటించుకోవడానికి ఆయన ఎవరు అని గోరంట్ల కోప్పడడం జరిగింది. ప్రతిష్ఠంభన ముదిరింది.
పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఈ గొడవకు తెరదించేశారు.  ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మనస్పర్ధలు ఇంకా ఒక్కరోజు కూడా కొనసాగడం తనకు ఇష్టం లేదన్నట్టుగా కందుల దుర్గేష్ ను నిడదవోలు అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ఒకే ఒక సీటు గురించిన వివరంతో పత్రికాప్రకటన విడుదల చేశారు. దీంతో సమస్య సమసిపోయింది.
తొలిజాబితాలో తెలుగుదేశం 94, జనసేన 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన 76 సీట్లను పార్టీల మద్య పంచుకోవడానికి చంద్రబాబు ఉండవిల్లి నివాసంలో మూడు పార్టీల నాయకుల మధ్య భేటీ కూడా ప్రారంభం అయింది. ఒకటిరెండు రోజుల్లో ఆ పంపకాలు తేలితే.. ఆ తర్వాత మూడు పార్టీల జాబితాలు బయటకు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. అయితే.. రాజమండ్రి రూరల్ ప్రతిష్ఠంభన కొనసాగడం ఏమాత్రం ఇష్టం లేని పవన్ కల్యాణ్.. కందుల దుర్గేష్ ను నిడదవోలుకు పంపుతూ ఒకే సీటు అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారని.. ఇక నిడదవోలు లోని నాయకుల్ని బుజ్జగించి జనసేనకు సహకరించేలా చేయడం చంద్రబాబు బాధ్యత అని ప్రజలు భావిస్తున్నారు. 

ReplyForwardAdd reaction

Related Posts

Comments

spot_img

Recent Stories