తిరుపతిలో నో ప్రాబ్లం : జనసేనకు లైన్ క్లియర్!

తిరుపతి అంటే వేంకటేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రం. అన్ని రకాల సెంటిమెంట్లకు తిరుపతి నెలవు అయినట్టే.. రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ సెంటిమెంటు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అయితే తన కీలక ప్రచారాలను తిరుపతినుంచే ప్రారంభించే వారు. తన పెళ్లి సంగతిని కూడా ఆయన తిరుపతిలోనే ప్రకటించారు. అలాంటి తిరుపతి నియోజకవర్గాన్ని తెలుగుదేశం ఇప్పుడు జనసేనకు కేటాయించింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం తెలుగుదేశం చేస్తున్న త్యాగాల పరంపరలో ఇది కూడా కీలకం అని చెప్పాలి. తిరుపతి నుంచి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా సరే ఈ ఎన్నికల్లో జనసేనకు కేటాయించేశారు.

తిరుపతి తెదేపా టికెట్ ను ఆశిస్తున్న కీలక నాయకులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్ లను చంద్రబాబునాయుడు పిలిపించి మాట్లాడారని స్థానికంగా ప్రచారం సాగుతోంది. వారిని ఒప్పించారని, జనసేన విజయానికి కష్టపడి పనిచేసేలా వారు కూడా సంసిద్ధత తెలియజేశారని అంటున్నారు. జనసేన నుంచి ఇక్కడ పోటీచేయడానికి పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ ఆశలు పెట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా పోటీచేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. 
ఏది ఏమైనప్పటికీ.. ఎంతో సెంటిమెంటుగా భావించే తిరుపతి నుంచి విపక్ష కూటమి అభ్యర్థికి ఎలాంటి చికాకులు లేని సానుకూల వాతావరణం ఏర్పడడం సానుకూల పరిణామంగా భావించవచ్చు. తెలుగుదేశం నాయకులు అసంతృప్తితో లేకపోవడం అనేది జనసేన విజయానికి మొదటిమెట్టు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.  

తిరుపతిని జనసేనకు కూడా బలమైన సీటుగానే భావించాలి. గతంలో చిరంజీవి కూడా ఇక్కడినుంచి విజయం సాధించారు. కాపు సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంటుంది. జనసేన అభ్యర్థిత్వం కూడా కాపులకే దక్కే అవకాశం ఉంది. వారికి ఉన్న వర్గ బలానికి తెలుగుదేశం బలం కూడా తోడైతే ఖచ్చితంగా విజయం సాధిస్తారని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమన అభినయ్ రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన భూమన కరుణాకరరెడ్డి ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ పదవి తీసుకుని, కొడుకును రంగంలోకి దింపారు. అయితే తిరుపతి నగర డిప్యూటీ మేయర్ గానే విపరీతమైన దందాలు సాగిస్తున్న నేతగా అపకీర్తి మూటగట్టుకున్న అభినయ్ రెడ్డికి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజల ఆదరణ ఏమాత్రం దక్కుతుందనేది పలువురి సందేహం. ఏ రకంగా చూసినా తిరుపతిలో జనసేన విజయం ఖాయం అనే అంచనాలు సాగుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories