జగన్ సర్కారును భ్రష్టు పట్టించేలా మంత్రి మాటలు!

ప్రజలకోసం సంక్షేమపథకాలు అమలు చేస్తున్నందుకు ప్రభుత్వాలు వారి నమ్మకాన్ని ఆశించాలి. అంతే తప్ప వాళ్లందరూ తమకు రుణగ్రస్థుల్లాగా పడి ఉండాలని, తాము సర్కారు సొమ్మను సంక్షేమం పేరుతో పంచిపెట్టడం వల్ల ప్రజలందరూ తమకు విధేయులుగా, పాలేర్లలాగా జీహుజూర్ అంటూ బతకాలని కోరుకుంటే మాత్రం అది తప్పు. అది పాలకుల అహంకారానికి నిదర్శనం అనిపించుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లోని ఒక సీనియర్ మంత్రిగారు కూడా అలాంటి అహంకారాన్ని పుష్కలంగా ప్రదర్శిస్తున్నారు. తన సభలకు హాజరుకాని, వచ్చినాసరే మధ్యలో వెళ్లిపోతున్న వారిమీద ఆయన కోపం కట్టలు తెంచుకుంటోంది. వాళ్లను సభాముఖంగా తిట్టిపోస్తున్నారు. అంటే.. తాము సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తున్నాం గనుక.. తమకు జై కొడితేనే వాళ్లు మనుషులు.. లేకపోతే వాళ్లందరూ పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా సదరు మంత్రిగారి అహంకారం ఆయనతో మాటలు అనిపిస్తోంది. ఆయన మరెవ్వరో కాదు.. ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన ప్రసాదరావు.
‘‘ప్రభుత్వం నుంచి లబ్ధిపొంది కూడా ప్రభుత్వానికి విధేయులుగా లేని పనికిమాలిన వాళ్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అంటూ ధర్మాన ఒక సభలో రెచ్చిపోయారు. అయితే.. ఎన్నికలకు ముందు ప్రజలే దేవుళ్లు అని నాటకాలు ఆడే రాజకీయ నాయకులు.. ఎన్నికల తర్వాత.. వాళ్లంతా పనికిమాలిన వాళ్లు అనడమే వారి అసలు బుద్ధికి నిదర్శనంగా కనిపిస్తోంది. నిజానికి ధర్మాన వ్యాఖ్యలు.. జగన్ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించేలా ఉన్నాయని, ఆయనను ఇరుకునపెట్టేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ధర్మాన అతిగా మాట్లాడడం ఇది తొలిసారి కాదు. ఇది తొలిమాట కూడా కాదు. అనేక సార్లు అనేక విధాలుగా  ఆయన తన దూకుడును ప్రదర్శిస్తూనే ఉంటారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో తమ భూములను త్యాగం చేసిన రైతులంతా పోరాటాలు, దీక్షలు చేస్తోంటే.. దానికి పోటీగా విశాఖలో వెంటనే రాజధాని ఏర్పాటు కావాలంటూ దీక్ష నాటకాలు నడిపించిన వ్యక్తి ధర్మాన. న్యాయరాజధాని, శాసన రాజధాని అనే పదాలన్నీ ఉత్తుత్తివేనని, కేవలం ఆ ప్రాంతం వారిని తృప్తి పరచడం కోసం చెబుతున్న మాటలేనని.. ఎగ్జిక్యూటివ్ రాజధాని అని వ్యవహరిస్తున్నప్పటికీ.. విశాఖ ఒక్కటే అసలు రాజధాని అని ధర్మాన అనేక సందర్భాల్లో చెప్పారు. నిజానికి ఆయన మాటలతో గుంటూరు, కర్నూలు ప్రాంతాల ప్రజలకు జగన్ ప్రభుత్వం ఎలాంటి మోసానికి పాల్పడుతున్నదో అర్థమైంది. ప్రస్తుతం ఆయనను ప్రజలను దూషిస్తూ నిందలు వేస్తూ మాట్లాడుతున్నమాటలు కూడా.. ప్రభుత్వం యొక్క అసలు బుద్ధికి నిదర్శనాలని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories