అధికారుల్ని బెదిరించడం, వారి మీద ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా పనిచేయించడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. అయిదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. అధికార్లను చెప్పుచేతల్లో పెట్టుకోవడం ద్వారా.. తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడాన్నే వారు పాలన మార్గంగా ఎంచుకున్నారు. చివరికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కూడా విడిచిపెట్టినట్టుగా కనిపించడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రోజుల్లో పరిపాలనకు కేంద్రబిందువుగా ఉండే రాష్ట్ర ప్రధానాధికారి మీద కూడా లెక్కలేనంత బురద చల్లుతూ.. అలా బురద చల్లకుండా ఉండాలంటే తమ దారిలోకి రావాలని బెదిరిస్తున్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు లెక్కకు మిక్కిలిగా పోలయ్యాయి. గత ఎన్నికలకంటె దాదాపు ఒకటిన్నర లక్షల ఓట్లు అధికంగా, మొత్తం 4.4 లక్షల ఓట్ల వరకు పడ్డాయి. అయితే.. జగన్ ప్రభుత్వం గత ఎన్నికలకుముందు ఉద్యోగులకు ఇచ్చిన మాటల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం.. అదే సమయంలో పీఆర్సీ దగ్గరినుంచి అన్ని విషయాల్లోనూ ఉద్యోగవర్గాలను వంచించడం అన్నీ కలిపి ఉద్యోగులపై పనిచేశాయి. జగన్ సర్కారు మీద తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఉద్యోగులు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను గరిష్టంగా వాడుకున్నారు. అనేక అవస్థలు పడి మరీ ఓటు వేశారు.
తీరా.. వారికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడంలోనే కొన్ని లోపాలు దొర్లేలా ప్రభుత్వం కుట్రలు నడిపించింది. అటెస్టింగ్ అధికారి సంతకమూ, స్టాంపూ లేకుండా డిక్లరేషన్ ఫారంలు ఇచ్చేశారు. ఉద్యోగులు చాలా మంది అవన్నీ చూసుకోకుండానే బ్యాలెట్లు వేసేశారు. దీంతో చాలా ఓట్లు స్టాంపులేకుండానే పడ్డాయి. తమ ఓటు చెల్లకుండా పోతుందనే భయంతో.. వారంతా ఈసీకి మొరపెట్టుకున్నారు. వీటన్నింటి ఫలితంగా.. స్టాంపు లేకపోయినా, అధికారి సంతకం ఉంటే చాలునంటూ సీఈఓ మీనా ఆదేశాలు జారీచేశారు.
ఈ ఆదేశాలతో వైసీపీ బెంబేలెత్తిపోయింది. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ చెల్లుబాటు అయితే.. తమ కొంప కొల్లేరు అవుతుందని భయపడ్డారు. తెలుగుదేశంతో మీనా కుమ్మక్కు అయ్యారంటూ బురద చల్లారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉద్యోగుల ఓట్లకు అన్యాయం జరగకుండా ఆదేశాలిస్తే.. వాటికి ముడిపెట్టి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో మీనా ఆ ఆదేశాలను వెనక్కు తీసుకున్నారు. అధికారుల్ని బెదిరించి తమకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేదాకా వేధించే అలవాటును వైసీపీ కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా వదలిపెట్టడం లేదని ప్రజలు భావిస్తున్నారు.