చెవిరెడ్డి బెదిరిస్తే.. ఈసీ కూడా ఫాలో అవుతుందా?

‘‘మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడం.. మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మేం రాజకీయ నాయకులం. గుర్తు పెట్టుకోండి. మాపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు. మేం ప్రెవేటు కేసులు పెట్టామంటే.. మీరు కోర్టుల చుట్టూ తిరగాలి్స వస్తుంది. జాగ్రత్త. కాస్త చూసీ చూడనట్టు పోండి’’ ఈ మాటలు మీకు గుర్తుకొస్తున్నాయా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, సిటింగ్ ఎమ్మెల్యే మంత్రిపదవిని మిస్ అయినా అంతకుమించి పెత్తనం చెలాయించే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఒంగోలు ఎంపీగా పోటీచేస్తూ అక్కడి రిటర్నింగ్ అధికారిని ప్రచార సందర్భంగా హెచ్చరించిన తీరు ఇది. ప్రచార సమయంలోనే ఆర్వోను ఆ రేంజిలో బెదిరించిన చెవిరెడ్డి, ఆమె కంటిన్యూ అయితే కౌంటింగ్ నాడు తమ ఆటలు సాగవని ముందే భయపడ్డారేమో.. ఆర్వోగా విధులనుంచి తప్పించేలా పావులు కదిపారు. ముక్కుసూటిగా వెళ్లే అధికారులకు వైసీపీ పాలనలో ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు గానీ.. ఇప్పుడు ప్రత్యేకించి కోడ్ అమల్లో ఉండగా.. ఎన్నికల సంఘం చేతిలోనే సర్వాధికారాలు ఉండగా.. చెవిరెడ్డి బెదిరింపులకు గురైన మహిళా అధికారిని తప్పించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా ఆడిస్తే అలా ఆడడానికి సీఎస్ జవహర్ రెడ్డి హాజరుగా ఉంటారనేది అందరూ అనుకుంటున్న సంగతే. చివరికి ఎన్నికల సంఘం కూడా వారికి అనుగుణంగానే పనిచేస్తున్నదా? అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది.
మాచర్ల పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి విషయంలో కూడా.. ఆయన ఈవీఎంను పగుల గొట్టిన వీడియో బయటకు వచ్చి.. రచ్చరచ్చ అయిపోయిన తర్వాత గానీ.. ఈసీ పద్ధతిగా స్పందించలేదు. నిజానికి సీసీ కెమెరాలు పెట్టిన తర్రవాత.. ఈవీఎం ధ్వంసం అనేది అదేరోజున ఎన్నికల సంఘం ప్రతినిధులు గమనించి ఉండాలి. అలా జరిగి ఉంటే.. అదేరోజున పిన్నెల్లిమీద కేసులు నమోదై ఉండేవి. కానీ.. ఆయన సావకాశంగా తప్పించుకుపోయే దాకా అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఈసీ నిద్ర మేలుకొన్నదనే ఆరోపణలున్నాయి.
అదే మాదిరిగా ఒంగోలు ఆర్వోను తప్పించడం కూడా.. అచ్చంగా.. చెవిరెడ్డి మాటలకు ఈసీ తలొగ్గడం వల్ల మాత్రమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్ నిష్పాక్షికంగా జరుగుతుందా? తిమ్మిని బమ్మిని చేయకుండా ఉంటారా? అనే అనుమానం కూడా పలువురికి కలుగుతోంది. మరి ఎన్నికల సంఘం తమ నిజాయితీని ఎలా నిరూపించుకుంటుందో ఏమో?

Related Posts

Comments

spot_img

Recent Stories