రాష్ట్రంలో ఎన్నికల కోడ్అమల్లోకి వచ్చింది. ‘ప్రభుత్వం’ అని సాగించే సకల అరాచకాలకు ఇప్పుడు ఫుల్స్టాప్ పెట్టాలి. రాజకీయ అధికార హోదాలతో సాగించే దందాలకు తాత్కాలిక అడ్డుకట్ట పడుతుంది. ఆ క్రమంలో కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే తిరుమలలో దర్శనాలకోసం వీఐపీ ఉత్తరాల మీద కేటాయించే బ్రేక్ దర్శనాలకు బ్రేక్ పడింది. శ్రీవారి వీఐపీ దర్శనం పేరిట భారీగా డబ్బులు దండుకునే టీటీడీ వారి అధికారికదందా ‘శ్రీవాణి టికెట్ల’ రూపంలోసాగించే దోపిడీ డోసేజీ ఇప్పుడు పెంచారని తెలుస్తోంది.
వీఐపీ దర్శనాలు, సిఫారసు ఉత్తరాలకు వీఐపీ టికెట్లు కేటాయించడం అనే దందాలో.. రోజుకు దాదాపు ఏడెనిమిది వేల మందిని పైగా దర్శనానికి పంపుతున్నారు. వీఐపీ ఉత్తరాల విషయంలోనిజంగానే ఉత్తరాలు ఇచ్చే వీఐపీలు కొందరు ఉండగా.. మేగ్జిమం ఉత్తరాలతో సదరు వీఐపీ అనుచరులు అక్రమ దందాలే చేసుకుంటూ ఉంటారు. ఆ సిఫారసు ఉత్తరాల మీద వీఐపీ టికెట్లకోసం లెటర్లు పెట్టి.. ఒక్కో టికెట్ పై పది- పదిహేను వేల రూపాయల వరకు భక్తులను దోచుకుంటున్నారు.
అయితే కోడ్ కూసిన వెంటనే.. ఈ వీఐపీ దర్శనాల సిఫారసులకు చెక్ పడింది. దీంతో ఆ అక్రమార్కుల బిజినెస్ ఆగిపోయింది. అయితే.. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా.. ఈసారి, టీటీడీనే ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారాన్ని అందుబాటులోకి తెచ్చింది. పదివేలకు వీఐపీ టికెట్ లను విక్రయించే పద్ధతిని మరింత జోరుగా పెంచింది. గతంలో నిర్ణీత సంఖ్యలోనే వీఐపీ టికెట్లు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు అపరిమిత సంఖ్యలో ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
సందట్లో సడేమియా అన్నట్టు, కోడ్ వచ్చిన వెంటనే సిఫారిసులు పనిచేయవు కాబట్టి.. శ్రీవాణి టికెట్ల విక్రయం రూపేణా అందినకాడికి దండుకోవాలని టీటీడీ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఆదాయం నేరుగా టీటీడీకే అందుతోంది కదా.. దీనిపై కూడా విమర్శలు చేస్తే ఎలా అని ఎవరైనా అనుకోవచ్చు. ఆన్ లైన్ మాత్రమే కాకుండా, విమనానాశ్రయం వద్ద ఇతర ప్రదేశాల్లో కలిపి ఆఫ్ లైన్ టికెట్ల విక్రయాలు కూడా ఉండడంతో.. శ్రీవాణి టికెట్ ఇప్పిస్తాం అంటూ సంపన్నుల వద్ద లాబీయింగ్ చేస్తూ ఒక్కో టికెట్ మీద అయిదువేల రూపాయల వరకు దందా చేస్తున్న దళారీలను కూడా టీటీడీ ప్రోత్సహిస్తోంది. అసలే భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక.. తిరుపతిలోని తన అనుచరులు అందరికీ.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను బ్లాకులో అమ్ముకునే అవకాశాన్ని పుష్కలంగా కల్పించారు. ఇప్పుడు కోడ్ రాగానే.. నాయకులందరికీ ఇబ్బందేమో గానీ.. తిరుపతి నుంచి తన కొడుకు అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీచేయిస్తున్న ఈ టీటీడీ ఛైర్మన్ భూమనకు మాత్రం అనుచరులకు మరింతగా దోచిపెట్టే అవకాశం దక్కిందని పలువురు విమర్శిస్తున్నారు.