కన్నకూతురు అంటూ.. మరోవైపు గోతులు తవ్వుతూ..

నోటితో పొగుడుతూ.. నొసటితో వెక్కిరస్తూ చేసే కుటిలత్వం రాజకీయాల్లో కనిపించినంతగా మరెక్కడా మనకు కనిపించదు. ఇప్పుడు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో అదే ధోరణి మనకు కనిపిస్తోంది. నగరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. ఆమెకు టిక్కెట్ ఇస్తే గెలిపించేది లేదని, ఓడించడానికి కష్టపడతామని అక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ కే విన్నవించుకుంటున్నారు. నగరికి ఇన్చార్జి ఎవరనేది జగన్ ఇప్పటిదాకా ఖరారు చేయనేలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రాజకీయ ప్రత్యర్థులే.. మీడియా ఇంటర్వ్యూలలో మాత్రం.. ఆమె తమ కుటుంబ సభ్యురాలని, తామందరమూ ఆమెను గెలిపించడానికి ప్రయత్నిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పడం కుటిల రాజకీయానికి పరాకాష్టగా కనిపిస్తోంది.


రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఒక మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ అనుసరిస్తున్న బదిలీల విధానం దగ్గరినుంచి, వ్యూహాలు, ముద్రగడ చేరిక వంటి అనేక అంశాలను ఆయన సమర్థించుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో మంత్రి రోజా గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. మిధున్ రెడ్డి చెప్పిన సమాధానాలు మాత్రం ఆశ్చర్యం కలిగించేవి. ఎందుకంటే.. ‘ఆమె ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆమెకే అభ్యర్థిత్వం దక్కుతుంది’ అని ఆయన చెప్పారు. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా అని అడిగినప్పుడు.. అవన్నీ అభూత కల్పనలని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి రోజా కూతురు వంటిదని మిధున్ రెడ్డి చెప్పడం విశేషం.


మీడియా ముందు ఆయన అలా చెప్పి ఉండొచ్చు గానీ.. వాస్తవం ఏంటంటే.. నగరిలో రోజా వ్యతిరేకవర్గం కేవలం పెద్దిరెడ్డి ఆశీస్సులతోనే బలపడి విచ్చలవిడిగా తయారైనదనే సంగతి అందరికీ తెలుసు. రోజా వ్యతిరేక కూటమి ఆయన అండ చూసుకుని, ఆమెకు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారని కూడా అందరికీ తెలుసు. అసలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రోజావర్గం- పెద్దిరెడ్డి వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నదని పార్టీలో కుర్ర కార్యకర్తలను అడిగినా చెబుతారు. రోజాకు టికెట్ రాకుండా అడ్డుపడే వర్గానికి, ఎమ్మెల్యేగా ఆమెకు సహకరించకుండా తలనొప్పిని కలిగిస్తున్న వర్గానికి పెద్దిరెడ్డే పెద్ద దిక్కు. ఇతంటి వక్రరాజకీయం నడుస్తుండగా.. ఆమె మా కుటుంబసభ్యురాలని, మా నాన్నకు కూతురు లాంటిదని మిధున్ రెడ్డి చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories