కూటమికి నైతిక బలం జకియా చేరిక!

చీమ చిటుక్కు మంటే చాలు.. కూటమి ప్రభుత్వానికి ముస్లిం వ్యతిరేకతను ఆపాదించి.. ఆ వర్గంలో కూటమి పార్టీల పట్ల అసంతృప్తి, ద్వేషం ఏర్పరచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ వస్తున్న సంగతి అందరూ గమనిస్తున్నదే. అయితే అలాంటి కుట్రలకు చెక్ పెట్టేలాగా.. వైసీపీకి రాజీనామా చేసిన శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానమ్ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె చేరిక కూటమి పార్టీలకు అతిపెద్ద నైతిక బలం అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించే కపట ముస్లిం ప్రేమకు కూడా ఇది షాక్ అని పలువురు విశ్లేషిస్తున్నారు.

కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకురాలు జకియా ఖానమ్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి గతంలో కట్టబెట్టారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా కూడా చేశారు. ఈ పదవులు కట్టబెట్టారే తప్ప.. పార్టీ పరంగా, జిల్లాలో పార్టీ వ్యవహారాల పరంగా ఎలాంటి కీలక భూమిక లేకుండా సైడ్ లైన్లోనే పెట్టారనే వాదన చాలాకాలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జకియా ఖానమ్.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆనడుమ మంత్రి ఫరూక్ తో సమావేశమైన ఆమె తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నారు. తర్వాత నారా లోకేష్ ను కలిసి, తెలుగుదేశంలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు కూడా. ఇది జరిగి చాన్నాళ్లే అయింది.

తాజాగా ఆమె తన శాసనమండలి సభ్యత్వానికి,  మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసి.. భాజపా కండువా కప్పుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం నాయకురాలు అయిన జకియా ఖానమ్ బిజెపిలో చేరడం అనేది కూటమి ప్రభుత్వానికి గొప్ప నైతిక మద్దతు. ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినందుకు.. జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన తైనాతీలు.. తెలుగుదేశాన్ని ముస్లిం వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి నానా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు సర్కారు.. ముస్లిం ల సంక్షేమం కోసం ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఏదో ఒక కుటిల విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలాంటి సమయంలో.. తెలుగుదేశంలో కంటె బిజెపిలో చేరడం వల్ల.. కూటమి సర్కారు ముస్లింల పట్ల వివక్ష చూపడం లేదనే సంగతి నిరూపణ అవుతుంది. ముస్లిం వర్గాల్లో బిజెపి పట్ల సానుకూలత ఉన్నదనే సంగతి తేలుతుంది. ఏ బిజెపిని అయితే బూచిగా చూపించి.. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారో.. ఆ కుటిల ప్రయత్నాలకు చెక్ పెట్టినట్టు కూడా అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories