పదవి ఇంకా ఏడాదికి పైగానే ఉంది. అయితే.. కొన్ని రోజులు ఆగితే.. తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం వస్తుందనే భయం ఉంది. ఆ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందనే అనుమానమూ ఉంది. అదే జరిగితే.. పరువు పోతుందనేది ఇంకా పెద్ద భయం. అందుకే ఆ వైసీపీ నేత తన పదవికి రాజీనామా చేసేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. స్థానిక సంస్థల్లో కూడా బలాబలాలు గణనీయంగా మారుతున్న నేపథ్యంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, వైసీపీకి చెందిన కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు ఇంకా పదవీకాలం ఏడాది మిగిలిఉండగానే రాజీనామా చేయడం విశేషం.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ నాయకులు ఏ స్థాయిలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ వచ్చారో అందరికీ తెలుసు. ఎన్నికల తర్వాత.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అడ్డగోలుగా రెచ్చిపోయిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు కూడా ఉన్నారు. ఆయన ఎంతగా రెచ్చిపోయినప్పటికీ.. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో.. వైసీపీ ప్రాభవాన్ని మాత్రం కాపాడుకోలేకపోయారు. గతంలో మునిసిపల్ ఎన్నికలు జరిగినప్పుడు.. నానా రకాల దందాలు నడిపించి.. తెదేపా జనసేన వారిని బెదిరించి, భయపెట్టి, చివరికి కిడ్నాపులు కూడా చేయించి.. వైసీపీ గరిష్టంగా సీట్లు దక్కించుకున్న సంగతి అందరికీ తెలుసు.
గుంటూరు కూడా అలాగే వారికి దక్కింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సీన్ మారింది.
వైసీపీ కార్పొరేటర్లు పలువురు కూటమి పార్టీల్లో చేరిపోయారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినప్పుడు ఆరు స్థానాల్లో తెలుగుదేశం, జనసేనకు చెందిన కార్పొరేటర్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో 17వ స్టాండింగ్ కమిటీ సమావేశం త్వరలో జరగాల్సి ఉంది. మేయర్ కావటి మనోహర్ నాయుడు మీద అవిశ్వాస తీర్మానం పెడతారనే చర్చ స్థానికంగా జరుగుతోంది.
అదే జరిగితే.. తాను పదవీచ్యుతుడు కావడం గ్యారంటీ అని మనోహర్ నాయుడు గ్రహించారు. పరువు పోగొట్టుకోవడం కంటె.. ముందుగానే తాను పదవిని వదలిపెట్టడం కాస్త గౌరవంగా ఉంటుందని అనుకున్నారు. అందుకే మేయర్ పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ స్థానానికి ఇప్పుడు ఎన్నిక జరిగితే.. గుంటూరు మేయర్ సీటు తెలుగుదేశం పరం అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలో అనేక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు కార్పొరేటర్ల సంఖ్యాబలం పరంగా కూటమి పార్టీల పరం అయిన సంగతి అందరికీ తెలిసిందే. మేయర్లు, ఛైర్మన్లకు నాలుగు సంవత్సరాల పదవీకాలం ముగిసిన తర్వాత.. అవిశ్వాస తీర్మానాలు కూడా వెల్లువలా మొదలవుతాయని.. ఆ స్థానాలు కూడా మెజారిటీ కూటమి పరం అవుతాయని ప్రజల్లో విశ్లేషణలు సాగుతున్నాయి.