తపస్సు చేసినా విశాఖను నిలుపుకోలేకపోతున్న వైసిపి!

పార్టీ నాయకులు ఇతర పార్టీల్లో చేరితే వారిని ప్రలోభ పెట్టారని. బెదిరించారని రకరకాలుగా ఆరోపణలు రావడం సహజం. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమాత్రం భవిష్యత్తు లేదని ఆ పార్టీలో ఉన్న వారందరూ ఆందోళన చెందుతున్న సమయంలో ఇలాంటి నిందలు వేయడం వలన ఉపయోగం లేదు. తమ భవిష్యత్తు గురించి తామే జాగ్రత్త వహించాలని అనుకునేవాళ్లు వైసీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ప్రత్యేకించి మునిసిపాలిటీలు కార్పొరేషన్లలో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే.. విశాఖపట్టణం నగర కార్పొరేషన్ కూడా నెమ్మదిగా వైసీపీ పట్టునుంచి జారుకుంటోంది. వైసీపీతోనే కలిసి ఉంటే.. భవిష్యత్తు ఉండదనే భయంతో.. కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరుతూ ఉండగా.. వారిని కట్టడి చేయడానికి ఆ పార్టీ ఎందరు సీనియర్లను రంగంలోకి దించినా, ఎన్ని క్యాంపు రాజకీయాలు చేసినా సఫలం కాలేకపోతోంది.

గ్రేటర్ఱ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ మేయర్ హరివెంకటకుమారిపై శనివారం అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో వైసీపీకి మరికొందరు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. కార్పొరేషన్ లో వైసీపీపకి చీఫ్ విప్ గా ఉన్న ముత్తంశెట్టి ప్రియాంక ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూతురు. తమాషా ఏంటంటే.. వైఎస్ జగన్ సంక్రాంతి నుంచి జిల్లాల యాత్ర చేస్తానని అంతకంటె ముందే ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన చేసిన సమయంలోనే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. జగన్.. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది కూడా సమయం ఇవ్వకుండా రాజకీయం చేయాలనుకోవడం బాగాలేదని జగన్ తీరును విమర్శించారు. ఆయన కూతురు కార్పొరేటర్ కాగా ఇన్నాళ్లూ అదే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆమె కూడా పార్టీని వీడారు.

అదే సమయంలో మరో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి కూడా జనసేనలో చేరిపోయారు. ఈ వంశీరెడ్డి.. గతంలో గాజువాకలో పవన్ కల్యాణ్ ను ఓడించిన తిప్పల నాగిరెడ్డి కొడుకే కావడం విశేషం. అవిశ్వాసం నెగ్గడానికి 72 మంది సభ్యుల బలం కావాలి. వంశీరెడ్డి జనసేనలో చేరిన తర్వాత కూటమి బలం 73కు చేరింది. అయితే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిన సమావేశానికి కోరం ఉండాలంటే 74 మంది సభ్యుల బలం అవసరం. ఈ నేపథ్యంలో మరికొందరు కార్పొరేటర్లను చేర్చుకోవడంపై కూటమి ఫోకస్ పెట్టింది. శుక్రవారం మరికొందరు కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరడం జరుగుతుందని తెలుస్తోంది.
కార్పొరేటర్లను పార్టీ కట్టుదాటకుండా కాపాడుకోవడానికి  బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories