తన కడుపున జగన్మోహన్ రెడ్డి వంటి దురాలోచనలు, దుర్బుద్ధులు ఉన్నవాడు పుడతాడని వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలో కూడా ఊహించి ఉండరు అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర ప్రజలలో నడుస్తోంది. కుటుంబ సంబంధాల పట్ల కుటుంబ బంధాలకు విలువ ఇవ్వడం పట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా ఆత్మీయతతో వ్యవహరించేవారు. కేవలం తన జీవితం విషయంలో మాత్రమే కాదు- ఇతరుల విషయాలలో కూడా ఆయన అలాంటి ధోరణిని ప్రకటిస్తుండేవారు. కూతురు వైఎస్ షర్మిల పట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలు కూడా చూపించేవారని సన్పిహితులు చెబుతుంటారు. అనేక సందర్భాలలో రాజకీయ శత్రువులను విమర్శించాల్సి వచ్చినప్పుడు ‘‘తల్లికి అన్నం పెట్టడు గాని పిన్నికి పరమాన్నం పెడతాడట’’ అనే సామెతను ఆయన ఉదాహరిస్తూ ఉండేవారు! కానీ ఆ సామెతకు అసలు సిసలు మానవరూపం వంటి వ్యక్తిగా తన కొడుకే తయారవుతాడని ఆయన బహుశా ఊహించి ఉండరు. తల్లికి చట్టబద్ధంగా ఇచ్చిన వారసత్వపు షేర్లను కూడా లాగేసుకోవడానికి కుట్రపూరితంగా వ్యవహరించేవాడు తనకొడుకే అవుతాడని వైఎస్ రాజశేఖరెడ్డి అంచనాలకు అందకపోయి ఉండవచ్చు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఏ బహిరంగ సభావేదిక మీద నుంచి గళం విప్పినా కూడా ‘నా అక్క చెల్లెమ్మలు.. నా అక్క చెల్లెమ్మలు..’ అంటూ రాగాలు తీసి నాటకీయంగా మాట్లాడుతుంటారు. అయితే ఇంట్లో ఉండే సొంత చెల్లెలికి ఆస్తులు పంచి ఇవ్వకుండా ఆమె జీవితాన్ని బజారుపాలు చేసి, మళ్ళీ ఆమె మీద కోర్టుకు వెళుతూన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు అందరికీ ఉమ్మడిగా ఏం సందేశం పంపదలచుకున్నారు అనేది కీలకంగా మారుతోంది. కుటుంబ బంధాల విలువ తెలియని మనిషిగా జగన్ మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు.
తన కుటుంబం ఈ రకంగా ఆస్తుల కోసం బజారున పడుతుందనే ఊహ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రేఖామాత్రంగానైనా అప్పట్లో అనిపించి ఉండదు. వందల కోట్ల రూపాయల ఆస్తులను ఆయన పోగేసి పెట్టారు. తన కొడుకు ఇంత సంకుచితంగా వ్యవహరిస్తూ తన కూతురికి వాటాలు ఇవ్వకుండా- చివరికి తన భార్యకు ఇచ్చిన వాటాలను కూడా వెనక్కు లాక్కోడానికి ప్రయత్నిస్తాడు అని ఆయన ఆలోచించి ఉండకపోవచ్చు. ఆయన మరణమే అనూహ్యంగా జరిగిన దుర్ఘటన! ఒకవేళ తాను మరణిస్తాననే స్పృహ ఆయనకు ఏమాత్రం కలిగిఉన్నా, ఆస్తులకు సంబంధించిన పూర్తి సెటిల్మెంట్ తానే చేసి ఉండేవారేమో అనే ఊహ కూడా ఇప్పుడు ప్రజలకు కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రజలలో ఉండే గౌరవాన్ని పలుచన చేసేస్తున్నదని వైయస్సార్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.