జగన్ సొంత జిల్లాలో రెండు ఓటములతో పోయే పరువు ఎటూ పోయింది. ఇక్కడితో జాగ్రత్త పడి భవిష్యత్తులో ఇంతటి దారుణమైన తిరస్కారాన్ని మళ్లీ మూటగట్టుకోకుండా జాగ్రత్త పడాలనే భావన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కలుగుతున్నట్టుగా లేదు. అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత పెల్లుబికిందో, ఆయన విధానాలను వారు ఎంతగా ఈసడించుకున్నారో రాష్ట్రంమొత్తం కలిపి 2024 సార్వత్రిక ఎన్నికల్లో నిరూపించింది. ఓడిపోయిన తర్వాత గత పద్నాలుగు నెలల కాలంలో జగన్ వైఖరిలో ఏం మార్పు వచ్చింది? విపక్ష నాయకుడిగా జగన్ తీరు ఏమాత్రం ప్రజాభిమానాన్ని మూటగట్టుకోలేకపోయింది. చివరికి తన సొంతమండలంలోని ప్రజలు కూడా మరింతగా అసహ్యించుకుంటున్నారనడానికి నిదర్శనమే పులివెందులలో డిపాజిట్ దక్కకపోవడం. ఇప్పటికైనా ఆ పార్టీ మేలుకుని.. ప్రజలు ఎందుకు తమను వ్యతిరేకిస్తున్నారో, తమ వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయో.. పారదర్శకంగా సర్వేలు చేయించుకుని తమ చేతలను తాము దిద్దుకుంటే బాగుపడతారు. కానీ.. ఆ పార్టీ అగ్రనాయకుల మాటలను గమనిస్తే, అలాటి పోకడ కనిపించడం లేదు సరికదా.. మరింతగా తమ గోతిని తామే తవ్వుకుంటున్న్టట్టుగా ఉంది. ఓటములను సవాలు చేస్తూ పోరాడడం మీద ఫోకస్ పెట్టడమే వారు ఇష్టపడుతున్నారు. తద్వారా ప్రజల తీర్పును అవమానించి, ఆ ప్రజలకు మరింత ఆగ్రహం కలిగిస్తున్నారు.
కడపజిల్లాలో జోడు ఓటములపై వైసీపీ హైకోర్టను ఆశ్రయించగా వారు కేసు కొట్టేశారు. ఈ ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న వైసీపీ డిమాండ్ ను హైకోర్టు తోసిరాజన్నది. అక్కడితో వారికి బుద్ధి రాలేదు. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరిగిపోయిన రికార్డు వేస్తున్నట్టుగా.. కడప ఎన్నికల్లో పరాజయం గురించి, టీడీపీ మోసాలు చేసినదంటూ.. పాత పాట పాడారు. రెఫరీ పాత్ర పోషించాల్సిన వారికి ఫిర్యాదు చేస్తే వారు కూడా తమ గోడు పట్టించుకోలేదని ఎన్నికల సంఘం మీద కూడా నిందలు వేశారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయో వెబ్ కాస్టింగ్ సీసీటీవీ ఫుటేజీలను గమనిస్తే సరిపోతుందని అంటున్నారు. వారు అన్యాయం చేసినా సరే.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద లేదని.. ఇంకా పైస్థాయికి వెళ్లి పోరాడుతామని సజ్జల అంటున్నారు.
అంటే.. కడపజిల్లాలో జోడు ఓటములపై వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించేలా కనిపిస్తోంది. అయితే వెబ్ కాస్టింగ్, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి.. ఓటింగ్ జరిగిన సరళిని పోల్చిచూసి నిగ్గు తేల్చాలని వారు కోర్టుకు వెళితే కాస్త ప్రయోజనం ఉంటుంది. కోర్టులో కేసు తేలేదాకా ఈ ఫుటేజీలను ఈసీ భ్రదపరచి ఉంచాలని కూడా ఉత్తర్వులు తేవొచ్చు. కానీ.. వారు కోరేది అది కాదు.. ఎలా పిటిషన్ వేస్తే అది తిరస్కరణకు గురవుతుందో అలా వేస్తున్నారు. ఈ రెండు ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు. దీనిని కోర్టు ఒప్పుకునే అవకాశం లేదు. కోర్టులో అనుమతించగల డిమాండ్లతో వారు ఆశ్రయించడం లేదు. నిజంగా వెబ్ కాస్టింగ్ ఫుటేజీని గమనించడం వారికి అక్కర్లేదు. ఆ పేరుతో డ్రామా నడిపించాలి అంతే. తిరస్కరణకు గురయ్యే డిమాండుతో కోర్టుకు వెళ్లడం, వాళ్లు నోచెప్పిన తర్వాత.. న్యాయస్థానాల్లో కూడా న్యాయం జరగలేదని కపటవిలాపాలు సాగించడం వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.