వారెవ్వా : ఐదేళ్ల జీతం.. ఒక్క రోజుకు తాయిలం!

గ్రామాల్లో ఓటర్లతో ఇంతకాలం వ్యక్తిగతంగా టచ్ లో ఉంటూ వచ్చిన వాలంటీర్లను ప్రలోభ పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విసురుతున్న వల చాలా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. వారు ఆఫర్ చేస్తున్న తాయిలాల గురించి విని వాలంటీర్లకే దిమ్మ తిరుగుతోంది. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఇంత సొమ్ములు అప్పనంగా వచ్చి పడిపోతాయా? సాధ్యమేనా? కల కాదు కదా? అని ఆశపడుతున్నారు. ఇంతకు ఏం జరుగుతోంది..?

వాలంటీర్లను ప్రలోభ పెట్టి వారితో రాజీనామాలు చేయించి, ఎన్నికల రోజున తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లుగా వాడుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా వ్యూహం. వారిద్వారా పింఛన్లు పంపిణీ చేస్తూ ‘‘జగన్ మళ్ళీ గెలవకపోతే ఆ లబ్ధి ప్రజలకు శాశ్వతంగా ఆగిపోతుంది’’ అని లబ్ధిదారులను భయపెడుతూ, గెలవవచ్చునని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ పాచిక పారకపోవడంతో ఇప్పుడు వారితో రాజీనామాలు చేయిస్తున్నది. వారిని ఎన్నికల ప్రచారంలో తమ వెంట తిప్పుకోవడానికి కూడా వీల్లేకపోవడం వల్ల ఇలాంటి ఎత్తుగడకు వెళ్ళింది. ఇప్పుడు రాజీనామా చేసేస్తే ఈ పది రోజులు పాటు ముమ్మరంగా వారితో ప్రచారం నిర్వహించవచ్చు అనేది పార్టీ ఆలోచన. అలాగే వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాడుకుంటే ఓటర్లు బూత్‌కు వచ్చిన సమయంలో అక్కడ కూర్చుని ప్రభావితం చేయగలరు అనేది ఆశ!

అయితే వాలంటీర్లకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనం 10000 రూపాయలకు పెంచుతామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటన ఇప్పుడున్న వాలంటీర్లలో ఆశలను పెంచుతుంది. వైసిపి వారు మాత్రం అందరూ తమ కార్యకర్తలే గనుక బలవంతంగా రాజీనామా చేయించాలని అనుకుంటున్నారు. అందుకుగాను ఒక్కొక్కరికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయల సొమ్ము ఒకేసారి ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు లక్షల రూపాయలు అంటే గత ఐదేళ్లపాటు వాలంటీరుగా పనిచేసే సంపాదించిన జీతంతో సమానం అని ఆ ఆఫర్ వినిన వారు కూడా విస్తుపోతున్నారు.

ఒక వాలంటీరుకు నెల జీతం ఐదు వేల రూపాయలు. ఈ లెక్కన అయిదేళ్లు పనిచేస్తే 3 లక్షల రూపాయలు వస్తాయి. ఒక్కరోజు పోలింగ్ బూత్ ఏజెంటుగా పని చేయడానికి సిద్ధపడి ఆ పదవికి రాజీనామా చేస్తే ఐదేళ్ల జీతంతో సమానమైన మూడు లక్షల రూపాయలు తాయిలంగా లభిస్తోందంటే వారు నమ్మలేకపోతున్నారు. అయితే వారి ద్వారా లబ్ధిదారులైన వృద్ధులను వికలాంగులను వితంతువులను భయపెట్టడం ప్రలోభ పెట్టడం సులువు కనుక, వారి మీద ఇంత భారీ పెట్టుబడి పెట్టి పోలింగ్ ఏజెంట్లుగా వాడడానికి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories