వెనకటికి ఆడడం చేతకాని ఒక నాట్యగత్తే మద్దెల ఓడు అని సాకులు చెప్పిందనేది సామెత. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి వ్యవహార సరళి అందుకు భిన్నంగా ఎంత మాత్రమూ లేదు. రాష్ట్రంలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు ధైర్యం లేదనే మాట చెప్పలేక బరిలోకి దిగే సాహసం లేక కుంటి సాకులు వెతుక్కుంటున్నది వైసిపి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి సరిగా లేదని ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని అందువలన తాము ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని వారు సెలవిస్తున్నారు. ఎన్నికలలో పోటీకి దిగే ధైర్యం లేకపోవడం కూడా ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఒక మార్గంగా వాడుకుంటున్న వారి అతి తెలివితేటల మీద ప్రజలు నవ్వుకుంటున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు కీలక జిల్లాలను కవర్ చేస్తూ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలకు మరియు కృష్ణ గుంటూరు జిల్లాలకు కలిపి ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులుగా పేరాబత్తుల రాజశేఖర్ మరియు ఆలపాటి రాజాల పేర్లను ప్రకటించింది. వారు ఆల్రెడీ ప్రచారపర్వంలోకి దిగేశారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ చాలా చురుకుగా సాగుతోంది. పట్టభద్రుల ఓట్లను సమీకరించడానికి ఎన్ డి ఏ కూటమిలోని మూడు పార్టీలతో కలిసి సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలా ముందంజలో ఉన్నారు. ఇప్పటిదాకా కనీసం అభ్యర్థిని ఎంపిక చేయడానికి కూడా గతి లేని స్థితిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఎన్నికల్లో పోటీకి దిగే నాయకుడే దిక్కు లేని
తమ పార్టీ తరఫున.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా వైసిపి అధికార ప్రతినిధి కాకపోయినప్పటికీ అలా వ్యవహరిస్తున్న పేర్ని నాని ప్రకటించారు. ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం లేదు కనుక వారు పోటీ చేయడం లేదుట. కాబట్టి మేము పోటీ చేయం అని వైసీపీ తరఫున పేర్ని నాని ప్రకటిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అతితెలివి తేటలు చూసి జనం మాత్రం నవ్వుకుంటున్నారు.