అన్నయ్యకు  చుక్కలు చూపిస్తున్న వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి రోజుకొక కొత్త కోణంలోంచి చుక్కలు చూపిస్తున్నారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన హంతకులను మళ్లీ పార్లమెంటుకు పంపడానికి జగన్ తహతహలాడి పోతున్నాడని, హంతకులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడనే విమర్శలతో తొలినుంచి ఆమె చెలరేగిపోతున్న సంగతి అందరికీ తెలుసు. ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికే.. ప్రియమైన అన్నాతమ్ములు జగన్ – అవినాష్ రెడ్డి కిందామీదా అయిపోతున్నారు. దానికి తోడు.. గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను పదేపదే ప్రశ్నిస్తూ షర్మిల ఆయన పాలన బండారాన్ని బజారుకీడుస్తున్నారు.

తాజాగా ‘నవ సందేహాలను’ వ్యక్తం చేస్తూ చేతనమైతే వాటికి సమాధానం చెప్పాలని షర్మిల అన్నయ్యకు సవాలు విసిరారు. నవరత్నాలు ఏపీ ప్రజలందరికీ పంచి పెట్టేశానన్నట్టుగా టముకు వేసుకుంటూ ఉండే  జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి ఇది షర్మిల వ్యంగ్యాత్మక రిటార్టు అన్నమాట. ఇంతకూ షర్మిల వ్యక్తం చేస్తున్న ఆ తొమ్మిది సందేహాలు ఏమిటో తెలుసా?

2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. ఏమైంది?
ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వడం లేదు?
25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా తెస్తామన్నారు. ఏమైంది?
గ్రూప్ 2 కింద ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు ఎందుకు?
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు?
23వేలతో మెగా డీఎస్సీని 6 వేల పోస్టుల దగా డీఎస్సీగా ఎందుకు మార్చారు?
నిరుద్యోగులు 7.7 శాతం పెరికారంటే అది మీ వైఫల్యం కాదా?
యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలసపోతున్నారు?
ఇప్పుడు జాబు రావాలి అంటే.. మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా?
..అంటూ షర్మిల ప్రశ్నలను సంధించారు.
నిజానికి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ల కంటె కూడా సూటిగా స్పష్టమైన ప్రశ్నలతో వైఎస్ షర్మిల జగన్ పాలనను ఎండగట్టేస్తుండడం విశేషం. ఆమె ఏమాత్రం జాలి చూపించడం లేదు. నామేనిఫెస్టోలో 99శాతం చేసేశాను అంటూ.. పాత పెన్షన్ స్కీమ్ తేలేకపోవడం ఒక్కటే మిస్సయినట్టుగా జగన్ తన మాటలతో జనాన్ని మాయ చేస్తున్నారు. అయితే ఆయన అయిదేళ్ల పరిపాలనలో మొత్తంగా ఎన్నెన్ని వైఫల్యాలు ఉన్నాయో షర్మిల రోజుకొక రీతిగా చీల్చి చెండాడేస్తున్నారు. ఉద్యోగకల్పనలో వైఫల్యాల గురించి గతంలో కూడా ప్రశ్నించినప్పటికీ.. తాజాగా నవ సందేహాలు అంటే వెటకారంగా ప్రశ్నలు సంధించడం విశేషం.

Related Posts

Comments

spot_img

Recent Stories