కడుపులో కత్తులు పెట్టుకుని పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉండడం అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూసిన చాలా సందర్భాల్లో ప్రజలకు అలా అనిపిస్తుంటుంది. ప్రత్యేకించి ఒకటి రెండేళ్లుగా.. ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరిగేప్పుడు జగన్ ప్రజలకు ఇలా కనిపిస్తారు. కన్నతల్లి వైఎస్ విజయమ్మతో ఆయనకు కొన్నేళ్లుగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. అయినా సరే.. ఇడుపులపాయలో తల్లి ఎదురు పడినప్పుడు ఆయన చాలా కృతకమైన చిరునవ్వులు చిందిస్తారు.
ఆమె ఆయన నుదుట ముద్దులు పెడతారు. ఇద్దరి మధ్య ఈ దృశ్యం.. తొలిరోజుల్లో హృద్యంగానే ఉండేది గానీ.. ఇప్పుడు తల్లి మీద జగన్ కేసు నడుపుతున్న వివరం కూడా తెలిసిన వారికి నాటకీయంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా అలాంటి పరిస్థితి కూడా రాకుండా ఉండేందుకు జగన్ ముందే ప్లాన్ చేసినట్టు సమాచారం.
తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆల్రెడీ పులివెందుల నివాసానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఇడుపులపాయ వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించాలనేది కార్యక్రమం. అయితే సాధారణంగా ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా హాజరు అవుతారు. అయితే వారు వచ్చే టైమింగ్ కాకుండా.. వారు ఎదురు పడకుండా తన టైమింగ్ ప్లాన్ చేయాలని జగన్ తన అనుచరులను ఆదేశించినట్టు సమాచారం.
ఇప్పటికే తల్లీ కొడుకుల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. తల్లికి ఇచ్చిన షేర్ల గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని జగన్ దావా నడుపుతున్నారు. జగన్ మోసం చేస్తున్నాడని, అతనికి రద్దు చేసే హక్కు లేదని విజయమ్మ వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఆమెకు ఎదురుపడడం కూడా ఇష్టం లేక జగన్ ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.