ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం సాధారణ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా? కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దిగజారిపోయిన పార్టీకి సారధిగా సభలో కూర్చోవడానికి బదులు ఎమ్మెల్యేగా రాజీనామా చేసేస్తే కాస్త పరువు దక్కుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నిర్ణయం మాత్రమే కాదు. ఈనెల 22 వ తేదీన శాసనసభ సమావేశాలను నిర్వహించాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, అదేరోజు తన పదవికి రాజీనామా చేయాలని జగన్ అనుకుంటున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈ మేరకు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఆయనను చూసి ఎవరైనా సరే జడుసుకు పోవాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన రాజకీయ పార్టీకి భవిష్యత్తులో అసలు నామమాత్ర అస్తిత్వం కూడా ఉండదని పలువురు అంచనా వేస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయదలుచుకున్నారని సర్వత్రా వినవస్తోంది.
జగన్ కేవలం 11 మంది సభ్యుల నాయకుడిగా అసెంబ్లీలోకి వెళ్లడానికి సిగ్గుపడుతున్నారు. మొహమాటపడుతున్నారు. అవమానంగా భావిస్తున్నారు. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన దుస్థితి సంప్రాప్తించినందుకు కుమిలిపోతున్నారు. అందుకే ఈ పరిస్థితుల నుంచే దూరంగా పారిపోవాలని చూస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాలని అనుకోవడం పట్ల అసలు సీక్రెట్ ఇదేననే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
ఎమ్మెల్యేగా రాజీనామా చేసేసి, పులివెందుల నియోజకవర్గం నుంచి తల్లి వైఎస్ విజయమ్మను లేదా భార్య భారతిని పోటీచేయిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రియమైన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీగా ఉండగా.. ఆయనతో కూడా రాజీనామా చేయించి.. జగన్ కడప ఎంపీగా పోటీచేస్తారని.. ఢిల్లీ రాజకీయాలకు పరిమితం కావాలని అనుకుంటున్నాకరని కూడా సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువలా సాగుతున్నాయి.