మూడున్నర వేల కోట్ల రూపాయల సొమ్ములను బెదిరింపుల ద్వారా ముడుపులుగా స్వీకరించిన అతిపెద్ద మద్యం కుంభకోణంలో ఇప్పటికి 33 మంది నిందితులు మాత్రమే తేలారు. అయితే ఇంకా అనేకమంది పాత్ర ఈ కుంభకోణంలో ఉన్నట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది. నిందితుల జాబితాలో మరింత మంది పేర్లను చేర్చడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రియమైన తమ్ముడు అవినాష్ రెడ్డి పేరు కూడా లిక్కర్ స్కామ్ లోకి చేరుతుందా అనే అంచనాలు ఇప్పుడు సాగుతున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డికి అరాచకాలు సాగించడంలో ఆత్మగా వ్యవహరించినటువంటి మరో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు హనుమంతరెడ్డి.. తుపాకీ చూపించి మరీ ఆర్థోస్ బెవరేజెస్ ప్రతినిధిని.. ముడుపులు ఇవ్వాలని బెదిరించినట్టు విచారణలో తేలిన తర్వాత.. ఈ కుంభకోణం వెనుక అవినాష్ పాత్ర గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ ప్రోత్సాహంతో ఆయన సాగించిన అనేక దందాలకు హనుమంతరెడ్డి కీలకం అని కూడా తెలుస్తోంది.
నంద్యాలజిల్లాకు చెందిన హనుమంతరెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు కు వలసవచ్చిన తర్వాత.. అవినాష్ రెడ్డికి సన్నిహితుడిగా ఎదిగాడు. ఆ తర్వాత బస్సు యాత్ర సమయంలో జగన్ కు కూడా ఎంతో దగ్గరయ్యాడు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే టాప్ ప్రయారిటీకింద అయినవాళ్లకు మేలు చేసే కార్యక్రమాల్లో హనుమంతరెడ్డికి గన్ లైసెన్సు ఇవ్వడంకూడా ఒకటి. అది చాలదన్నట్టుగా ప్రభుత్వం ఆయనకు గన్ మెన్ ను కూడా ఇచ్చింది.
ముద్దనూరులో ఇటుకబట్టీ అనేది అతని అధికారిక వ్యాపారం. కానీ అనతికాలంలో దందాల ద్వారా అత్యంత సంపన్నుడిగా ఎదిగాడు. ఇసుకదందాలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో విభేదాలు రావడంతో.. అతడిని ప్లేస్ మార్చారు అవినాష్ రెడ్డి. అప్పటినుంచి అవినాష్ కీలక అనుచరుడిగా కొనసాగుతూ హైదరాబాదు, కర్నూలు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అనేక సెటిల్మెంట్లు చేసేవాడు. రియల్టర్లను బెదిరించి సొమ్ము చేసుకోవడం అతని ప్రధాన వ్యాపకంగా మారింది. మద్యం కంపెనీలతో కూడా ఇదే తరహాలో తుపాకీతో బెదిరించి లొంగదీసుకుని లిక్కర్ స్కామ్ లో భాగంగా మార్చేవాడు.
జమ్మలమడుగులో హనుమంతరెడ్డి ఓ మూడంతస్తుల భవనం కట్టుకున్నాడు. ఆ స్థలం తమది అంటూ ఓ ఎష్టీ దంపతులు ఆందోళన చేశారు. ఆ తర్వాత వారిద్దరూ అదృశ్యం అయిపోయారు. నాలుగేళ్లుగా వారి ఆచూకీ లేదు. 60 లక్షల విలువైన భూమిని ఆక్రమించినట్టుగా, ఇళ్లపట్టాల పేరుతో మోసాలుచేసినట్టుగా కూడా ఆరోపణలున్నాయి.
అవినాష్ రెడ్డికి అరాచకాల ఆత్మలాగా ఎదిగిన హనుమంతరెడ్డి చరిత్ర చాలా ఉంది. వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి కూడా అతను అత్యంత ఆత్మీయుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగానూ, పార్టీకి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగానూ పదవులు కూడా వెలగబెట్టాడు. టీవీ ఛానెళ్ల చర్చల్లో పార్టీ తరఫున వచ్చేవాడు. ఓ చానెల్ లో సమైక్యాంధ్ర నాయకుడు ఒకరిని చెప్పులో కొడతానని లైవ్ లో అనడం ద్వారా వార్తల్లోకెక్కాడు. పైగా అవినాష్ రెడ్డికి ఎన్నికల దందాల్లో సహకరించడానికి కడప ఎంపీగా 2014లో బీఎస్పీ తరఫున, 2024లో జనసహాయక శక్తి పార్టీ తరఫున పోటీచేయడం కూడా విశేషం. మరి ఇంతటి అరాచక వ్యక్తి హనుమంతరెడ్డి విషయంలో కనీసం ఇప్పటిదాకా గన్ లైసెన్సు కూడా రద్దు చేయకుండా కూటమి ప్రభుత్వం ఉపేక్షిస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.