తన బలప్రదర్శన చేయడానికి, అహంకారాన్ని పదర్శించుకోవడానికి.. వేలమంది ప్రజల్ని కిరాయికి తరలించి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన రెంటపాళ్ల పరామర్శ యాత్ర.. ఒక ప్రాణాన్ని దారుణంగా బలితీసుకున్న సంగతి అందరికీ తెలుసు. స్వయంగా తన కారుకింద తన పార్టీకే చెందిన వృద్ధుడు పడిపోతే.. తొక్కించుకుంటూ వెళ్లిపోయిన జగన్ దుర్మార్గం ఆ వీడియోలు చూసిన ప్రజల కళ్ల ఎదుట కదలాడుతూనే ఉంది. ఆ వీడియోలు బయటకు వచ్చిన క్షణం నుంచి.. అటు సాక్షి మీడియా దళాలు, జగన్ వందిమాగధులు, వైసీపీ నీలిదళాలు అందరూ రెచ్చిపోయి మాట్లాడారు. జగన్ ను ఇరికించడానికి మార్ఫింగ్ వీడియోలు విడుదల చేసారంటూ.. అబద్ధాలను ప్రచారం చేశారు. బొంకువీరులందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి.. నానా కూతలు కూశారు. తీరా ఇప్పుడు అసలైన ఫోరెన్సిక్ నివేదిక వచ్చేసింది. జగన్ కారు కింద పడడం వల్ల మాత్రమే.. దళితుడైన చీలి సింగయ్య మరణించినట్టుగా ఆ నివేదిక నిర్ధారిస్తోంది.
జూన్ 18న రెంటపాళ్ల యాత్రలో వైఎస్ జగన్, సింగయ్య ను బలితీసుకున్నారు. జగన్ కారు కింద ఆయన పడితే.. కారు ముందు చక్రంతో తొక్కించుకుంటూ కొంతదూరం లాక్కుని వెళ్లారు. ఆ తర్వాత అతడిని లాగి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. తర్వాత వృద్ధుడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు తెలిసింది.
అయితే, జగన్ కారు కింద పడినట్టుగా వీడియోలు విడుదలైనా కూడా.. జగన్ దళాలు, సాక్షిమీడియా రెచ్చిపోయి బొంకులను ప్రచారంలో పెట్టాయి. అవి మార్పింగ్ వీడియోలు అన్నాయి. పోలీసులు సంయమనం కోల్పోకుండా పక్కా ఆధారాలు సేకరించారు. డ్రోన్ సీసీ కెమెరాల ఫుటేజీలు అన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ.. వాటిని సమన్వయం చేసుకుని ప్రమాదం జరిగిన సమయంలో.. ఆ కారు చుట్టూ ఉండి వీడియోలు తీస్తున్న కార్యకర్తలను గుర్తించారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులోని వీడియోలను ఫోరెన్సిక్ పరిశీలనకోసం పంపారు. ఆరు ఫోన్లలో తీసిన వీడియోలను పరిశీలించగా.. అన్నీ ఒరిజినల్ అని తేలింది. ఇప్పుడు జగన్ ఈ నరబలి కేసులో పక్కగా ఇరుక్కున్నారు.
సింగయ్య మరణానికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో కారు డ్రైవర్ ఏ1 కాగా, వైఎస్ జగన్ ఏ2గా ఉన్నారు. కొందరు వైసీపీ నాయకులు కూడా నిందితులుగా ఉన్నారు. వారందరూ కూడా ఈ కేసును కొట్టేయాల్సిందిగా కోర్టులో పిటిషన్లు వేసుకున్నారు. కాగా.. వీడియోలు అబద్ధం అంటూ బొంకిన వారందరూ ఇప్పుడు బయటకు రావాలని.. ఫోరెన్సిక్ నివేదిక నేపథ్యంలో ఏం చెప్తారో చూడాలని ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.