మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిస్టియానిటీ మూలాలనే ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్! జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యావత్ క్రిస్టియన్, దళిత వర్గాలు సిగ్గుపడాల్సిన విధంగా సాగుతున్న వ్యవహారాలు అని ఆయన విమర్శిస్తున్నారు. మొన్నమొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి.. జగన్మోహన్ రెడ్డికి సమీపంగానే మెలగుతూ ఆయన వ్యక్తిత్వ విశేషాలను గమనిస్తూ వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఈ స్థాయిలో జగన్ మతవిశ్వాసాల మూలాలను ప్రశ్నించేలా.. రాష్ట్రంలోని దళిత క్రిస్టియన్ వర్గాల్లో జగన్ పట్ల అపనమ్మకం కలిగేలా మాట్లాడడం ఇప్పుడు సంచలనం అవుతోంది.
అదానీనుంచి ముడుపులు తీసుకున్న వ్యవహారంలో.. జగన్ మాటలను ఖండించడానికి తెలుగుదేశం నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియా ముందుకు వచ్చారు. అమెరికా డబ్బులు తీసుకోలేదని అంటున్న జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే ఒకసారి అమెరికా వెళ్లి, తిరిగి రావాలని డొక్కా సవాలు విసురుతున్నారు. ఒకసారి అమెరికాకు వెళితే ఇక ఆయనకు తిరిగివచ్చే పరిస్థితి ఉండదని, అక్కడి కేసులు ఆయనను కదలనివ్వవని డొక్కా అంటున్నారు. అదానీ డబ్బులు తీసుకోలేదని, అమెరికా డబ్బులు తీసుకోలేదని అంటున్న జగన్.. అమెరికాకు వెళితే సంగతి తెలుస్తుందని అంటున్నారు.
పనిలో పనిగా ఆయన మతవిశ్వాసాలను కూడా ప్రశ్నిస్తున్నారు డొక్కా. నువ్వు అసలైన మంచి క్రిస్టియన్ వి కాదు. ప్రజలకు సేవ చేయడానికే పుట్టినటువంటి మదర థెరెసా వంటి క్రిస్టియన్ వి కాదు నువ్వు. భారతదేశాన్ని దోచుకోవడానికి ఈస్టిండియా కంపెనీ రూపంలో వచ్చినటువంటి వారన్ హేస్టింగ్స్ తరహా క్రిస్టియన్ వి అని డొక్కా విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలోని క్రిస్టియన్, దళిత సోదరులందరినీ జగన్ వంచించారని, భ్రష్టుపట్టించారని జగన్ అంటున్నారు. నా ఎస్సీ సోదరులను పదేపదే అంటూ.. దళితులు, క్రిస్టియన్లు అయిన పేదవర్గాలను మిగిలిన ప్రజలు అందరూ అనుమానించే పరిస్థితి జగన్ కల్పించాడని డొక్కా అంటున్నారు. క్రిస్టియన్ వర్గాల్లో జగన్ తనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్నదని అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఆ వర్గాల్లో కూడా ఇప్పుడు డొక్కా వంటి నాయకుల మాటలు పునరాలోచన కలిగిస్తున్నాయి. జగన్ పట్ల సానుభూతిగా ఉండడం అంటేనే ఆయన అవినీతి దుర్మార్గాలకు బాసటగా ఉండడం అనే అభిప్రాయాన్ని వారిలో కలిగిస్తున్నాయి.