విజయసాయి గుడ్ బై పై వైసీపీ విచిత్ర ట్వీట్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టూగా సుదీర్ఘకాలం కొనసాగిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా పట్ల.. ఆ పార్టీ అధికారిక స్పందన కొంత చిత్రంగా కనిపిస్తోంది. ఆయన రాజీనామా వెనుక ఎలాంటి అసంతృప్తి కారణాలు లేవు అనే భ్రమను ప్రజల్లో కలుగజేయడానికి వారు తాపత్రయ పడుతున్నారు. విజయసాయిరెడ్డి తన రాజీనామా సంగతిని ప్రకటించిన ట్వీట్ లో పేర్కొన్నట్టుగా.. ఆయన కేవలం వ్యవసాయం చేయడం కోసమే రాజ్యసభ ఎంపీ పదవిని వదలుకున్నట్టుగా ప్రజలు నమ్మాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తాపత్రయపడుతోంది. కానీ అసలు ఆయన రాజీనామా ను వైసీపీ ఒప్పుకున్నట్లా లేదా? అనే సందేహం పుట్టేలా విచిత్రమైన ట్వీట్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టడం గమనార్హం.

వారి ట్వీట్ లో ‘‘మేము మీ నిర్ణయాన్ని ఆమోదించకనప్పటికీ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాము.’’ అని ట్వీట్ చేశారు. సాధారణంగా ఎవరు ఏ పదవికి రాజీనామా చేసినా.. దాని తర్వాతి దశ ‘ఆమోదం’ పొందడమే. రాజ్యసభ ఎంపీ పదవికి చేసిన రాజీనామాను ఛైర్మన్ ధన్‌ఖడ్ ను కలిసి విజయసాయిరెడ్డి సమర్పించారు. ధన్‌ఖడ్ ఆ రాజీనామాను ఆమోదించారు. అక్కడితో ఆయన ఎంపీ పదవి పర్వం పూర్తయినట్టు లెక్క. అదే రకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాను పార్టీ ఆమోదించాలి. ఆమోదిస్తే.. ఆయనకు పార్టీతో బంధం తెగతెంపులు అయినట్టు లెక్క! కానీ పార్టీ తమ అధికారిక ట్వీట్ లో ‘‘మీ నిర్ణయాన్ని ఆమోదించకపోయినప్పటికీ, గౌరవిస్తున్నాము’’ అని చిత్రంగా ప్రకటించారు. ఆమోదించడం లేదు అంటే.. విజయసాయి ప్రాథమిక సభ్యత్వం రద్దు కానట్టే. తద్వారా.. విజయసాయిని పార్టీ నుంచి అధికారికంగా వెళ్లనివ్వకుండా, కేవలం రాజకీయాలకు దూరంగా ఉండడానికి మాత్రం వారు అనుమతిస్తున్నారా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.
అలాగే.. విజయసాయి కేవలం సేద్యం చేయడం కోసమే రాజకీయాలు మానుకున్నారనే అభిప్రాయాన్ని వ్యాప్తి చేయాలని వైసీపీ భావిస్తోంది. ‘‘హార్టికల్చర్ లో మీ అభిరుచిని కొనసాగించడానికి, రాజకీయాలనుంచి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాము’’ అని కూడా వైసీపీ పేర్కొంది. తద్వారా, ఆయన రాజీనామాకు పార్టీలో నెంబర్ టూ స్థానం విషయంలో ఉన్న ముఠా కుమ్ములాటలు కారణం కాదనే సంకేతాలు పంపడానికి పార్టీ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. తన రాజీనామా ట్వీట్ లో భవిష్యత్తులో జగన్ కు అంతా మంచి జరగాలని విజయసాయి కోరుకుంటే.. దానికి జవాబు అన్నట్టుగా.. ‘‘భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము’’ అంటూ వైసీపీ ట్వీట్ చేయడం సున్నితమైన వెటకారంగా ప్రజలు భావిస్తున్నారు. లండన్ లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడినుంచి తిరిగివచ్చిన తర్వాత.. పార్టీలో అనేక కీలక పరిణామాలు ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories