ఏదైనా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు.. ఆ సమస్య గురించి ప్రజలు అంతకంటె తీవ్రంగా ఆందోళన చేస్తున్నప్పుడు.. ప్రతిపక్షంగా ఉండే రాజకీయ పార్టీ ఆ సమస్యను టేకప్ చేస్తే దాని వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒకటి- సమస్య తీరే అవకాశం ఉంది. రెండు- ప్రజల కోసం వారి తరఫున పోరాడారు అనే కీర్తి ప్రతిపక్షానికి దక్కుతుంది. అంతే తప్ప అసలు సమస్యే లేనప్పుడు దానికోసం ఆందోళన చేయడం అంటే.. అభాసుపాలు కావడం తప్ప మరేం జరుగుతుంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థితిలో ఉంది. పైగా అయిదేళ్లుగా తాము పట్టించుకోని సమస్య గురించి.. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం ద్వారా.. పార్టీ మరింతగా నవ్వులపాలు అవుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇప్పుడు హఠాత్తుగా విశాఖ ఉక్కు గురించి ప్రేమ పుట్టుకొచ్చింది. అయినా సరే… వారి అసందర్భపు ప్రేమను వ్యక్తం చేయడానికి ఎమ్మెల్యేలు ఎటూ అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఎమ్మెల్సీలు మాత్రమే మండలికి వెళుతున్నారు. మండలిలో వారు ఈ పాయింట్ లేవనెత్తారు. విశాఖ ఉక్కును ప్రెవేటీకరించకూడదంటూ.. ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు కోరారు. వారినుంచి ఆ డిమాండ్ రాగానే.. అయిదేళ్లు అధికారంలో ఉండి మీరు ఆ పని ఎందుకు చేయలేకపోయారంటూ పాలకపక్షం నుంచి తీవ్రంగానే ఎదురుదాడి వచ్చింది.
ఆ సంగతి పక్కన పెడితే- విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ అనేది దాదాపుగా ముగిసిపోయిన సమస్య. ఉక్కు శాఖకు సహాయమంత్రిగా ఉన్న ఏపీకి చెందిన బిజెపి ఎంపీ శ్రీనివాస వర్మ ఆ విషయం పలుమార్లు చెప్పారు. సాక్షాత్తూ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖ ప్లాంట్ ను సందర్శించి.. ప్రెవేటీకరణ ఆలోచన ప్రభుత్వానికి లేదని అక్కడే ప్రకటించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో ఢిల్లీలో కూడా ప్రకటించారు. మరొకవైపు కూటమి ప్రభుత్వ నాయకులు పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ అనేది జరిగే అవకాశమే లేదని అంటున్నారు. అయినా సరే.. అందుకోసం తీర్మానం అంటూ పట్టుబట్టడం ద్వారా వైసీపీ అభాసుపాలయ్యే ఆందోళనలు చేస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.
మరొకవైపు తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ నాయకుడు జగన్ ఢిల్లీ వెళ్లి ప్రదాని మోడీకి ప్రెవేటీకరణ వద్దని చెప్పారని బొత్స అనడం ఇంకో కామెడీ. అప్పట్లో ప్రెవేటీకరణను ఆపగలిగే బలం తమకున్నది గనుక.. అఖిలపక్షం వేయలేదని అంటూ బొత్స పేర్కొన్నారు. మీ నాయకుడు ఢిల్లీ వెళ్లి మోడీ తో మాట్లాడి ఏం సాధించలేదని, అదే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రెవేటీకరణ ఉండబోదు అనే ప్రకటన ఉక్కుమంత్రి ద్వారా సాధించారని పాలకపక్ష నాయకులు రిటార్టు ఇవ్వడం గమనార్హం.