వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అజ్ఞానంతో ఎత్తులు వేస్తున్నదా? లేదా, అతి తెలివితేటలతో పావులు కదుపుతున్నదా? అర్థం కావడం లేదు. గుంటూరు మిర్చి యార్డుకు రైతుల పరామర్శ పేరిట ఒక డ్రామా నడిపించారు జగన్మోహన్ రెడ్డి. ఆ పర్యటన, మీడియా ముందు ప్రసంగమూ అంతా ఒక చిన్న కామెడీ ఎపిసోడ్ లాగా జరిగింది. ఆ డ్రామా వలన అనుకున్నంత మైలేజీ క్రియేట్ కాలేదు. మిర్చియార్డుకు వెళ్లి వచ్చిన దగ్గరినుంచి జగన్ గానీ, ఆయన అనుచర వందిమాగధులు, భట్రాజులు గానీ.. ఒక్కరు కూడా మిర్చి రైతుల సమస్య గురించి మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత కల్పించడం లేదు.. పోలీసుల్ని పంపలేదు అంటూ నానా గోల చేస్తున్నారు. వారికి వేరే జగన్ భద్రత పేరుతో గోల చేయడం అనేది తమకు ఎక్కువ మైలేజీ ఇస్తుందని వారు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తప్పు చేయడం మాత్రమే కాకుండా.. .జగన్ ను అక్కడికక్కడ అరెస్టు చేయకుండా వదిలిపెట్టినందుకు వైసీపీ నేతలు చాలా చాలా రెచ్చిపోతున్నారు. జగన్ కు భద్రత కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, అందుచేత ఆయనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని వైసీపీ లోక్ సభ పక్ష నేత మిధున్ రెడ్డి ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు లేఖలు కూడా రాశారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి కేంద్ర బలగాలు కావాలంటే.. అసలు ఆయనను ఎవరు వెళ్లమన్నారు..? పోలీసులు వారిస్తున్నా వినకుండా వెళ్లిందే కాకుండా.. తాము చేసిన తప్పును ఎవరూ గుర్తించరు లే అనుకుంటూ.. ఏకంగా ప్రధానికి ఫిర్యాదు చేయడం వల్ల ఆ పార్టీ, జగన్ మరింతగా భ్రష్టుపట్టిపోతారు కదా అని ప్రజలు అనుకుంటున్నారు.
మిథుణ్ రెడ్డి లేఖ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా అక్కడి మీడియా వాళ్లు ఇదే ప్రశ్న అడిగారు. దానికి ఆయన చాలా సూటిగా జవాబు చెప్పారు. ఈసీ కంటె జగన్ ఎక్కువేమీ కాదు కదా.. ఎన్నికల సందర్భంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నప్పుడు ఇలా చేయడం ఎలా సమర్థించుకుంటారు. పోలీసుల మాట వినకుండా వెళ్లినదే కాకుండా.. మళ్లీ ఎదురుదాడికి దిగుతున్నారు. అని చంద్రబాబు వివరించారు.
ఇంతకూ జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన అనుచరుల ఆలోచనలు ఎలా సాగుతున్నాయో అర్థం కావడం లేదు. తాము నిబంధనలు తుంగలో తొక్కేసి చేసిన ఓవరాక్షన్ గురించి ప్రధాని, హోంమంత్రి అస్సలు గ్రహించలేనంత అమాయకులు అని వారనుకుంటున్నారా? ప్రభుత్వం మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అని అనగానే నమ్మేసి.. చంద్రబాబు ప్రభుత్వాన్ని కేంద్రం డిస్మిస్ చేస్తుందని అనుకుంటున్నారా? లేదా, వీరు అడిగారు కదాని.. జగన్ సెక్యూరిటీ నిమిత్తం ఓ నాలుగు ప్లాటూన్ల సైనికుల్ని ఆయన చుట్టూ కవాతు చేయడానికి పంపుతుందని అనుకుంటున్నారా? తెలియడంలేదు. మిధున్ రెడ్డి లేఖను కేంద్రం పట్టించుకోకపోతే గనుక.. జగన్ పరువు మరింతగా మంటగలిసిపోయినట్టే కదా? అందుకే.. ఈ లేఖ ద్వారా పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నదని అంతా అంటున్నారు.