ఎమ్మెల్సీలపై జగన్ వక్రనిర్ణయాలకు చెక్!

జగన్మోహన్ రెడ్డి భవితవ్యం గురించి ముందే గ్రహించిన ఎమ్మెల్సీలు కొందరు.. ఎన్నికలకు పూర్వమే ఆ పార్టీని విడిచి పెట్టడం జరిగింది. అయితే.. వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ.. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వారి మీద వేటు వేసేశారు. వీరిలో రెండు స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరగగా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. అయితే అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరకపోయినప్పటికీ.. వక్రపూరితంగా ఆరోపణలు బనాయించి.. వేటు వేసిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి.. జగన్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. వీరిని మండలి ఛైర్మన్ అనర్హులుగాి ప్రకటించినప్పటికీ.. ఆ స్థానాలు ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయవద్దని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జగన్ కుట్రకు ఆరకంగా బ్రేక్ పడింది. 

విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మరో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విషయంలో ఇలాంటి ఆదేశాలు వెలువడ్డాయి. 
ఎస్ కోటకు చెందిన ఇందుకూరి రఘురాజు భార్య సుబ్బలక్ష్మి అక్కడ వైస్ ఎంపీపీగా ఉన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. భార్య పార్టీ మారింది గనుక.. రఘురాజుపై కూడా పార్టీ ఆగ్రహించింది. ఆయన ఎమ్మెల్సీ స్థానానికి ఎసరు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారంటూ.. నోటీసులు ఇచ్చి అనర్హత వేటు వేశారు. 
ఇంతకూ వారు పేర్కొన్న కారణాలు వింటే నవ్వొస్తుంది. పార్టీ నాయకుల మీద విమర్శలు చేశారట. ప్రభుత్వం మీద విమర్శలు చేశారట. ఇవే కారణాలుగా వేటు వేయడం జరిగింది. ఈ తీరుపై రఘురాజు హైకోర్టుకు వెళ్లడంతో, ఆయన ఖాళీని నోటిఫై చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 

అదే  మాదిరిగా ఇవాళ జంగా కృష్ణమూర్తి విషయంలో కూడా తీర్పు వచ్చింది. తనను అనర్హుడిగా చేయడంపై జంగా హైకోర్టుకు వెళ్లారు. జగన్ ద్వారా అనేక రకాలుగా నష్టపోయిన జంగా ఆ పార్టీనుంచి బయటకు వచ్చాక వేటు వేయడం జరిగింది. ఆ విషయంలో కోర్టుకువెళ్లగా ఆయన స్థానాన్ని కూడా నోటిఫై చేయవద్దని ఈసీకి ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి తనను ధిక్కరించిన మండలిలోని సభ్యులపై వేటు వేయించడానికి జగన్ ఎంచుకున్న వక్రమార్గాలు కూడా ఫలించడం లేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories