వైసీపీ : ‘సాలిడ్‌’గా ఇస్తే తప్ప ఇల్లు కదలం!

వైసీపీలో ఇప్పుడు చిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. పోలింగ్ రోజు దగ్గరపడిపోతోంది. ద్వితీయశ్రేణి నాయకుల చేతుల్లోకి రాజకీయం వెళ్లిపోతోంది. ఈ కీలక సమయంలో వారందరూ కూడా సహకరిస్తే తప్ప పార్టీ గెలవడం కష్టం. ఇలాంటి సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఒక గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తమకు సాలిడ్ గా సొమ్ము  ముట్టజెబితే తప్ప ఈ ప్రచారపర్వాన్ని ముందుకు తీసుకువెళ్లబోయేది లేదని, తమకు సొమ్ము ముందే ముట్టాల్సిందేనని కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులు పట్టుబడుతున్నారు. ముందు జనానికి డబ్బు పంచి ఓట్లు కొనే వ్యవహారం కానివ్వండి మీకు కావాల్సింది తర్వాత ఇస్తానని అభ్యర్థులు అంటున్నాసరే.. వారు వినిపించుకోవడం లేదు. తమకు ఇచ్చేదేదో ముందే ఇస్తే తప్ప అడుగు బయటపెట్టేది లేదని అంటున్నారు. దీంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

ఇంతకూ విషయం ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందో లేదో అనే భయం ఆ పార్టీలోనే మొదలైంది. ఆ పార్టీ నాయకులే పలువురు తమ ప్రెవేటు సంభాషణల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు. కొంత మంది అసలు తమ పార్టీ గెలుపు మీద పెదవివిరుస్తున్నారు. ఢంకాబజాయించి గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. అనే మాట ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ద్వితీయశ్రేణి నాయకులతో పనిచేయించుకోవడం అనేది అబ్యర్థులకు కష్టం అయిపోతోంది. పార్టీ ప్రభుత్వం వస్తుందనే గ్యారంటీ ఉండేట్లయితే.. రకరకాల పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు వంటి తాయిలాల ఆశచూపించి వారితో పనిచేయించుకోవడం వీలయ్యేది. కానీ.. ఇప్పుడు అలాంటి మాటలు చెబితే ద్వితీయశ్రేణి నాయకులు పట్టించుకోవడం లేదు. తృణమూ పణమో తమ సేవలకు  ఒక ధర కట్టి, ముందుగా అది చెల్లిస్తేనే ప్రచారానికి వస్తామంటున్నారు. డబ్బు పంపిణీ వ్యవహారాలు దగ్గరుండి చూస్తాం అంటున్నారు. పార్టీ గెలుస్తుందో లేదో.. గెలిస్తే అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం.. ఇప్పుడు మేం పడే కష్టానికి ప్రతిఫలం దక్కాల్సిందే అని పట్టుదలగా ఉంటున్నారు. దీంతో అభ్యర్థులు ఒక్కసారిగా కోట్లకు కోట్ల రూపాయలు సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఓట్లు కొనుగోలు చేయడానికి ఇప్పటికే లిక్విడ్ క్యాష్ సిద్ధం చేసుకున్న వాళ్లు.. కిందిస్థాయి నాయకులకు మళ్లీ ఇప్పటికిప్పుడే డబ్బు నగదురూపంలో ఇవ్వాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు.  కొందరైతే తమ ఆస్తులను కూడా రాసేస్తున్నారు. కిందిస్థాయి నాయకుల మద్దతు లేకుండా ఏ ఒక్కరూ నెగ్గడం కష్టం. అందుచేత వారి అడిగిన డిమాండ్లకు ఒప్పుకుని తల తాకట్టు పెట్టి మరీ ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. పనిచేయడానికి డబ్బులు అడుగుతున్న నాయకులపై అభ్యర్థులు కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడంటే గతిలేక డబ్బు ఇస్తున్నారు గానీ.. రేపు తమ ప్రభుత్వం రాగానే.. వారి సంగతి చూస్తాం అని.. పార్టీలో మళ్లీ భవిష్యత్తులేకుండా చేస్తామని అంటున్నారు. మొత్తానికి వైసీపీ శ్రేణుల్లో గెలుపు గ్యారంటీ భావన లేకపోవడంతో.. పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉన్నదని తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories