ఎన్నికల బాండ్ల దందాలో బిజెపిని మించిపోయిన వైసీపీ!

బాండ్ల రూపంలో కొనుగోలు చేసి పార్టీలకు ముడుపులు సమర్పించడానికి ఒక చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్న సంస్థలు.. చేసిన అరాచకాలు అన్నీ ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. ఎన్నికల బాండ్లను విక్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని నాటకాలు ఆడినప్పటికీ.. సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడంతో పూర్తి వివరాలను సమగ్రంగా బయటపెట్టక తప్పలేదు. ఒక్కొక్క పార్టీ ఎంతెంత దందా చేసిందో, ప్రజల ఎదుట మాత్రం ఏ రకంగా నీతులు చెబుతూ ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. ఈ అరాచక దందాల పర్వంలో ఒక్క కోణంలోంచి చూసినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీచేసిన దందా.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా దాటిపోవడం విశేషం.

దాదాపు 11 వేల కోట్ల కంటె ఎక్కువగా ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని రాజకీయ పార్టీలు సొమ్ములు పొందాయి. ఈ సొమ్ములు, ఆయా పార్టీలు రెగ్యులర్ గా పొందుతూ ఉండే విరాళాలు, చందాలకు అదనం! మొత్తొ సొమ్ములో భారతీయ జనతా పార్టీకే ఇంచుమించు ఆరువేల కోట్ల రూపాయలు దక్కాయి. ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ ఒక్కటే 1368 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు కొని పార్టీలకు సమర్పించుకుంది. దేశంలో అంతగా పేరు ప్రఖ్యాతులు కూడా లేని లాటరీలు నిర్వహించే ఒక సంస్థ ఏకంగా.. అంత పెద్ద మొత్తం పార్టీలకు ఇవ్వడం దేశవ్యాప్తంగా పెను సంచలనం.

అయితే ఈ సంస్థనుంచి విరాళాలు ముట్టిన పార్టీల్లో ఏపీలో అధికారం వెలగబెడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ది దేశంలోనే మూడోస్థానం. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భాజపా కూడా వైసీపీ తర్వాతనే ఉంది.
ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ తరఫున అత్యధికంగా 540 కోట్లను తృణమూల్ కాంగ్రెస్ విరాళాలుగా స్వీకరించింది. టీఎంసీ తర్వాత డీఎంకే ఉంది. వారికి 509 కోట్లు దక్కాయి. మూడో ప్లేసులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కు 160 కోట్లు ఇచ్చారు. బిజెపికి దక్కింది 100 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ కు కూడా 50 కోట్లు వచ్చాయి. అలా ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి దందా సాగించడంలో వైసీపీ- బిజెపిని అధిగమించేసింది.

ఎవ్వరూ ఏప్రయోజనమూ ఆశించకుండా.. రాజకీయ పార్టీలకు ఇంతింత మొత్తాలు చందాలుగా ఎందుకు ఇస్తారు? ఏ మేలూ చేయకుండా ఇంత మొత్తాలు ఎందకు స్వీకరించాయి. ఇవన్నీ ప్రజలు ఆలోచించాల్సిన సంగతులు. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయడానికి పుట్టాయనే ఆలోచన మానుకుని, ఇలాంటి దందాలకోసం చందాలకోసం పుట్టి.. అధికారంలోకి వస్తున్నాయని ప్రజలు గ్రహిస్తే తప్ప దేశం బాగుపడదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories