లిక్కర్ ధర తగ్గింపు పై వణుకుతున్న వైసిపి

చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో తాము తక్కువ ధరకే నాణ్యమైన లిక్కర్ అందిస్తామని ప్రకటించారు. ప్రజల జేబులను కొల్లగొట్టే ప్రయత్నం చేయకుండా.. తక్కువ ధరకు ఇస్తామనే హామీని ప్రజలకు అందించారు. తాజాగా ప్రకటించిన నూతన మద్యం విధానంలో అప్పటి మాట నిలబెట్టుకున్నారు. అయితే ‘మద్యం ధర తగ్గింపు’ అనేది ప్రభుత్వానికి ఒక వర్గం ప్రజలలో అపరిమితమైన మంచి పేరు తీసుకువచ్చే వ్యవహారం కావడంతో.. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైనట్లుగా కనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వ వ్యాపారం చేయడంతో పాటు- అడ్డగోలుగా దోచుకోవడం కోసం కేవలం నగదు లావాదేవీలను మాత్రమే అనుమతించే విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు అలవాటు పడి ఉండే పేరున్న బ్రాండ్ లిక్కర్ సరఫరాను మొత్తం ఆపివేయించారు. ఊరూపేరూ లేని రకరకాల చిత్ర విచిత్రమైన పేర్లతో తయారు అయ్యే సొంత బ్రాండ్లను మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో పెట్టారు. పైగా బ్రాండెడ్ లిక్కర్ కంటే అతిఎక్కువ ధరలను ఈ నాసిరకం చవకబారు లిక్కర్ కు నిర్ణయించి అడ్డగోలుగా మద్యప్రియులను దోచుకునే స్కెచ్ అమలు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతి సాయంత్రం ప్రతిమద్యం దుకాణం వద్ద జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిట్టుకునే మద్యప్రియులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు.

ఇలాంటి నేపథ్యంలో అన్ని ప్రముఖ బ్రాండ్లను కూడా అందుబాటులో ఉంచుతామని.. లిక్కర్ ధరలను తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి విపరీతంగా మంచి పేరు వస్తుందనే భయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరుగుతూ ఉండగా మద్యం ధర మాత్రం తగ్గిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది- మద్యం ధర తగ్గించడం కాదు. జగన్ ప్రభుత్వం చేసిన దోపిడీనుంచి మద్యప్రియులకు విముక్తి కల్పించడం మాత్రమే అనే సంగతి బొత్సకు అర్థమైనట్టుగా లేదు. పైగా, బొత్స సత్యనారాయణ ఎలాంటి కువిమర్శలు చేసినప్పటికీ.. ప్రభుత్వం గురించి ప్రజలు చెడుగా అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. కేవలం మద్యం ధరలు మాత్రమే కాదు.. ప్రభుత్వం నిత్యావసరాల ధరలు కూడా తగ్గిస్తోంది. కందిపప్పు, చక్కెర మార్కెట్ రేట్లకంటె అతి తక్కువ ధరలకు అందించేలా ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. కాబట్టి.. బొత్స తన విమర్శలతో తానే నవ్వులపాలవుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories