ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే దానిని తమ రాజకీయ అవసరాలకు, స్వార్థానికి వాడుకోవాలని ఆలోచించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరీ నీచత్వానికి దిగజారుతోంది. ఆరోగ్యం బాగాలేక ఒక వృద్ధుడు కనుమూస్తే.. పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదు గనుక.. పింఛను కోసం సచివాలయానికి వెళ్లాల్సి వస్తుందనే బాధతో గుండె ఆగి మరణించినట్టుగా వైసీపీ ప్రచారానికి పూనుకుంది. పార్టీ ప్రచారానికి వారి తొత్తు మీడియా సాక్షి వంతపాడడం విశేషం. మృతుడి బంధువులతో అలా చెప్పించడానికి శిక్షణ కూడా సాక్షి రిపోర్టర్లే ఇవ్వడం ఇంకా ఘోరంగా విమర్శల పాలవుతోంది.
విషయం ఏంటంటే.. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని ఒక వృద్ధుడు వెంకటయ్య మరణించాడు. ఆయనకు కొన్నాళ్లుగా ఆరోగ్యం సరిగా లేదు. తిరుపతిలోని కూతురు ఇంటివద్ద ఉంటూ చికిత్స చేయించుకుంటూ ఉండేవాడు. తిరుపతినుంచి వెంకటగిరికి వచ్చాడు. తర్వాత మరణించాడు.
ఆ మరణం గురించి తెలిసిన వెంటనే వాలంటీరు, సాక్షి రిపోర్టరు అక్కడ రాబందుల్లా వాలిపోయారు. ‘ఒకటో తేదీ పింఛను ఇంటికి తెచ్చి ఇస్తారనే ఉద్దేశంతో మా మామ తిరుపతి నుంచి వచ్చాడు. రాగానే వాలంటీరు వచ్చాడా అని అడిగారు. లేదు.. ఈసారి వాలంటీరు తెచ్చి ఇవ్వడు. మూడోతేదీ సచివాలయానికి వెళ్లి తీసుకోవాలి అని నేను చెప్పగానే కుప్పకూలి గుండె ఆగి చనిపోయాడు’ అని ఆయన కోడలితో చెప్పించారు. చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసి, పింఛను నిలిపేసినందుకే వెంకటయ్య మృతి చెందినట్టు చెబితే.. సీఎం జగన్ ప్రత్యేకంగా ఆర్థిక సహాయం కూడా అందిస్తారంటూ.. ఆయన కూతురిని కూడా పురిగొల్పారు. అయితే.. వెంకటయ్య కోడలు,కూతురు వీరు నేర్పించినట్లుగా చెప్పడానికి తడబడుతూంటే.. వారికి మళ్లీ మళ్లీ ట్రైనింగు ఇచ్చారు. ఈ శవరాజకీయాల ట్రైనింగు క్లాసులు ఆడియో రికార్డులు లీకయ్యాయి. సాక్షి రిపోర్టరు, వాలంటీరు వాళ్లకు ట్రైనింగు ఇవ్వడం, సీఎం ప్రత్యేక సాయం అంటూ ఊరించడం.. చంద్రబాబును దోషిగా చూపేందుకు కుట్ర చేయడం ఇవన్నీ బయటకు వచ్చాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా అయినా దిగజారుతుందని తెలుసుగానీ, మరి శవ రాజకీయంలో కూడా ఇంత నీచంగా దిగజారుతుందా అని ప్రజలు విస్తుపోతున్నారు. ఈరెండునెలల్లో మరింత వృద్ధులు చచ్చిపోవాలని వైసీపీ కోరుకుంటుందేమోనని, రాష్ట్రంలో ఇప్పుడు ఏ వృద్ధుడు చనిపోయినా కూడా.. కేవలం పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వనందువల్లనే చచ్చిపోయినట్టుగా వంకర ప్రచారాలతో చెలరేగుతారని ప్రజలు అనుకుంటున్నారు. సచివాలయాల వద్ద పింఛను కోసం వచ్చే వృద్ధుల కోసం సరైన ఏర్పాట్లు చేయకుండా.. మరింత మందిని పొట్టన పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం.. నిందను చంద్రబాబు మీదకు నెట్టడానికి ప్రయత్నిస్తుందని కూడా అనుకుంటున్నారు.