వారంతా కొమ్ములు తిరిగిన మహానాయకులు. ఆ పార్టీలో మాత్రమే కాదు.. వారు అధికారంలో ఉన్నంత కాలం.. ఆయన మాట రాష్ట్రవ్యాప్తంగా వేదంలా చెల్లుబాటు అయ్యేది. చిత్తూరు జిల్లాలో అయితే అన్ని విషయాలనూ ఆయన ఒక్కడే శాసించే వారు. కానీ.. ఇలాంటి వైభవం అధికారం చేతిలో ఉన్నప్పుడు మాత్రమే సాగుతుంది. అధికారం చేజారిన తర్వాత.. అయినవాళ్లు కూడా పట్టించుకోరు.
చిత్తూరు జిల్లాలో కాజకీయంగా గత అయిదేళ్లుగా ఒక వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మునిసిపాలిటీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజారనుంది. అక్కడి పురపాలికపై తెలుగుదేశం జెండా ఎగరనుంది.
పుంగనూరు మునిసిపాలిటీకి సంబంధించి.. మునిసిపల్ ఛైర్మన్ అలీమ్ బాషాతో సహా 12 మంది వైసీపీ కౌన్సిలర్లు, ఆ పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జి చల్లాబాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరిపోయారు. ఇక్కడితో పుంగనూరు మునిసిపాలిటీ తెలుగుదేశం పరం కానుంది. ఈ మునిసిపాలిటీలో మొత్తం 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి 12 మంది చేరగా.. త్వరంలోనే మరికొందరు కౌన్సిలర్లు కూడా చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో పుంగనూరు మునిసిపాలిటీ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాభవానికి పూర్తిగా గండిపడనుంది.
పెద్దిరెడ్డి అంటే వైఎస్సార్ కాంగ్రెస్ లో కొమ్ములు తిరిగిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత.. నెంబర్ టూ స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అధికారం చెలాయించిన వైనం పెద్దిరెడ్డిదే. ఇసుక అక్రమ దందాలు, లిక్కర్ అక్రమ వ్యాపారాలు.. జగన్ ప్రభుత్వపు అక్రమార్జనలకు కీలకమైన మార్గాలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ రెండింటినీ కూడా కీలకంగా నడిపించింది పెద్దిరెడ్డే అనే ప్రచారం ఉంది.
రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి.. పార్టీలో చక్రం తిప్పారు. తీరా ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలోనే వైభవానికి గండిపడింది. చిత్తూరుజిల్లాల్లో ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబంలోని అన్నదమ్ములు తప్ప.. వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాగా.. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోని మునిసిపాలిటీని కూడా తెదేపా దక్కించుకుంది. దీంతో వైసీపీ నెంబర్ 2 పరువు గంగపాలు కానుందని విశ్లేషకులు అంటున్నారు.