తాజా రాజీనామాలతో వైసీపీ పెద్దలకు ముప్పే!

ఇవి మామూలు రాజీనామాలు కాదు. మామూలుగా అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు కనిపించడం లేదనే ఉద్దేశంతో పార్టీని వీడిపోతున్నవారు బోలెడు మంది ఉంటున్నారు. వైసీపీలో ఉండడం కంటె.. అసలు రాజకీయాలు వదులుకోవడమే మేలని అనుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. అవకాశం ఉన్నవాళ్లు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అలాంటి వారి వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని పార్టీ పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ.. ఇప్పుడు విశాఖలో చోటు చేసుకున్న తాజా రాజీనామాల వల్ల పార్టీకి ఎంత మేర నష్టమో తెలియదు గానీ, వైసీపీలోని కొందరు పెద్దలకు మాత్రం చిక్కులే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తంఅవుతోంది.
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు 9 మంది డెయిరీ డైరక్టర్లు కూడా రాజీనామా చేశారు. వారితో పాటు అడారి ఆనంద్ సోదరి ఎలమంచిలి పురపాలక సంఘం ఛైర్మన్ పిళ్లా రమాకుమారి కూడా రాజీనామా చేశారు. వీరిలో అడారి ఆనంద్ ఇటీవలి ఎన్నికల్లో విశాఖ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి కూడా. పోయేవాళ్లు పోతూ ఉంటారు.. కొత్తవాళ్లను తయారు చేసుకుందాం అని జగనన్న సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు గానీ.. ఇప్పునడు అడారి సహా డెయిరీ డైరక్టర్లు వెళ్లిపోవడంవలన.. వైసీపీలోని కొందరు పెద్దలకు చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.

విశాఖ డెయిరీలో అనేక అక్రమాలు జరుగుతున్నట్టుగా విపరీతంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణ నిమిత్తం శాసనసభా కమిటీని నియమించిన సంగతి అందరికీ తెలిసిందే. శాసనసభా కమిటీ ఇటీవలే విచారణ ప్రారంభించింది. కొన్ని వారాల వ్యవధిలోనే డెయిరీ ఛైర్మన్ సహా, డైరక్టర్లు కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. అయితే డెయిరీ అభివృద్ధి మీదనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉన్నందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే డైరక్టర్లు అందరూ పార్టీని వీడిపోవడం వెనుక కారణాలు వేరే ఉన్నాయి. డెయిరీలో అక్రమాలు జరగడం వెనుక వైసీపీలో కొందరు పెద్దల హస్తం, ఒత్తిడి ఉన్నదని.. ఇప్పుడు విచారణ ప్రారంభం అయిన నేపథ్యంలో అడారి ఆనంద్ సహా డైరక్టర్లు పార్టీని విడిచిపెట్టి.. గతంలో తమ మీద వత్తిడి చేసిన వారి గురించి అన్ని విషయాలూ దర్యాప్తులో బయబపెట్టబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories