వాలంటీర్ల మెడపై వైసీపీ కత్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లుగా పనిచేస్తున్న వారి జీవితాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. వారి ఉద్యోగాల మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కత్తి వేలాడుతోంది. వారిని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికి ఇప్పుడు వారందరితో  బలవంతంగానైనా సరే రాజీనామాలు చేయించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను వాడుకుంటూ ఉంటే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, వారితో రాజీనామాలు చేయించేస్తే ఏ గొడవా ఉండదని భావిస్తున్నారు. వాలంటీర్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒత్తిడి చేసి ఉద్యోగాలు ఊడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ‘వాలంటీర్లు అందరూ మన పార్టీ కార్యకర్తలే కదా ప్రస్తుతానికి వాళ్ళందరితో రాజీనామాలు చేయించి ఎన్నికల ప్రచారానికి వాడుకుందాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి సంగతి మళ్ళీ ఆలోచిద్దాం’ అనే వ్యూహంతో నాయకులు ముందుకు సాగుతున్నారు.

ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేలాగా వ్యవస్థను రూపు దిద్దినప్పుడే వీరి ద్వారా ఎన్నికల సమయంలో అనుచిత ప్రయోజనాలు పొందడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారని అందరూ ఊహించారు. దానికి తగ్గట్టుగానే వాలంటీర్లు వ్యవస్థ నడుస్తూ వచ్చింది. వాలంటీర్లు తమ సొంత పార్టీ కార్యకర్తలే అంటూ వారి ద్వారా జగన్ మళ్ళీ రాకపోతే పెన్షన్లు పథకాలు ఏవి కూడా రావు అనే మాటలు గత ఐదేళ్లుగా ప్రతి లబ్ధిదారునికి ప్రతినెలా చెప్పిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రచారాన్ని కొనసాగించాలని, ప్రభుత్వపరమైన ఎన్నికల విధులలో వాలంటీర్లను వాడుకోవడం ద్వారా అనుచిత లబ్ధి పొందవచ్చునని వైఎస్ఆర్సిపి భావించింది. కానీ వాలంటీర్లు ఎన్నికల విధులలో పాల్గొనకుండా బ్రేక్ పడింది. చివరికి వారి ద్వారా లబ్ధిదారులను ప్రలోభపెట్టే అవకాశం లేకుండా పింఛన్ల పంపిణీ నుంచి కూడా ఈసీ వారిని దూరం పెట్టింది. వాలంటీర్లు వైసిపి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళితే కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి చికాకులన్నీ తప్పించుకోడానికి ఏకంగా వారందరితోనూ రాజీనామాలు చేయించాలని వైసీపీ పెద్దలు నిర్ణయించారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వాలంటీర్లకు తమ ప్రభుత్వం లో వేతనం 10000 రూపాయలకు పెంచుతానని ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భయం పెరిగింది. వాలంటీర్లలో చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఏర్పడింది. ఇన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఎంతగా సేవలు చేస్తున్నా వేతనాలు పెంచమని అడిగితే పట్టించుకోని జగన్ సర్కారు పట్ల విముఖత ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తారేమో అనే భయం అధికార పార్టీలో పుట్టినట్లుగా కనిపిస్తుంది.

వాలంటీర్లతో తక్షణం రాజీనామా చేయించి వారు తమ కను సన్నల్లోంచి పక్కకు జారిపోకుండా ఉండేలా ఆ పార్టీ చర్యలు తీసుకుంటుంది. రాజీనామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నిత్యం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది అని భావిస్తున్నారు. సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. వాలంటీర్లందరూ మన వాళ్లే కదా.. అందరితో రాజీనామాలు చేయించి.. ప్రచారంలో వాడుకుందాం అని చెప్పడం కూడా ఈ పోకడకు నిదర్శనం.

Related Posts

Comments

spot_img

Recent Stories