సరిగ్గా ఎన్నికల ముంగిట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టమే వచ్చి పడింది. విశాఖలో పట్టుబడిన కంటైనర్ లోని లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దందాలో వారి పాత్ర సందేహాస్పదం అవుతోంది. వైసీపీ నాయకులు సమస్తంగా రంగంలోకి దిగి, వారి నీలిమీడియా సహాయంతో డ్రగ్స్ దందాను తెలుగుదేశం మీదికి, బిజెపి మీదకు నెట్టాలని చూస్తున్నారు. కానీ.. ఎదుటివారివైపు ఒక వేలు చూపుతోంటే.. మిగిలిన నాలుగువేళ్లు నీవైపే చూపుతుంటాయనే సామెత లాగా.. వైసీపీ వారి పాత్ర గురించే ఎక్కువ సందేహాలు పుడుతున్నాయి.
సంధ్యా ఆక్వా పరిశ్రమ కోసం బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రై ఈస్ట్ కంటైనర్ లో లక్షల కోట్ల విలువైన మత్తుపదార్థాలు ఉన్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. పరీక్షల్లో కొకైన్, హెరాయిన్ వంటి అత్యంత ఖరీదైన మత్తుపదార్థాలు ఉన్నట్టుగా గుర్తించారు. అప్పటినుంచి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సంధ్యా ఆక్వా అనే పేరు క్లియర్ గనుక.. వారితో ముడిపెట్టి తమ ప్రత్యర్థులకు సంబంధం ఉన్నట్టుగా చెప్పడానికి ఆరాటపడుతున్నాయి. కానీ వైసీపీ వాదనలు తేలిపోతున్నాయి.
వైసీపీ చెబుతున్నది ఏంటంటే.. సంధ్యా ఆక్వా వీరభద్రరావుతో.. బిజెపి రాష్ట్ర సారథి పురందేశ్వరి వియ్యంకుడు వ్యాపార భాగస్వామి అని! కానీ అది చాలా సంవత్సరాల కిందట. ఇప్పుడు వారు విడిపోయారు కూడా. వారి మధ్య వ్యాపార లావాదేవీలు లేవు. ఈ ఆరోపణ చేస్తూ.. పురందేశ్వరి కొడుక్కి ఈ దందాతో సంబంధం ఉందని వైసీపీ బురద చల్లుతోంది. కానీ బిజెపి ఆరోపిస్తున్నది.. వైసీపీని ఇరుకున పెట్టే వ్యవహారమే.
ఎందుకంటే- స్వయంగా సంధ్యా ఆక్వా వీరభద్రరావు తమ్ముడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు. ఆ విషయం స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఫ్లెక్సిల ఫోటోలను కూడా ఆ పార్టీ బయటపెట్టింది.
పైగా ఏ దేశంనుంచైతే ఈ డ్రగ్స్ వచ్చాయో.. ఆ బ్రెజిల్ దేశాధ్యక్షుడితో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి సంబంధాలున్నట్టుగా బయటకు వచ్చింది. బ్రెజిల్ అధ్యక్షుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ విజయసాయి ట్వీటారు కూడా. ఈ విషయాన్ని బయటపెడుతూ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు- ‘‘అసలు మన దేశంలో ఉండే నాయకుల్లో కనీసం ఒక్క శాతం మందైనా బ్రెజిల్ అధ్యక్షుడి పేరు చెప్పగలిగితే తన వేలు కోసుకుంటానని’’ ఆయన సవాలు విసిరారు. విజయసాయికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తో సంబంధాలు ఉన్నట్టు ట్వీట్ సహా ఆయన నిరూపించారు.
మొత్తానికి ఈ డ్రగ్స్ దందా వ్యవహారం మొత్తం.. వైసీపీ పుట్టిముంచేలా కనిపిస్తోంది. వారు తెదేపా, బిజెపికి పురందేశ్వరికి ముడిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు నమ్మేలా లేవు. అదే వారి పార్టీ వారి పాత్ర మాత్రం ఘాటుాగా ఉన్నట్టు కనిపిస్తోంది.