ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే వ్యతిరేకించడం ప్రతిపక్షం బాధ్యత. ప్రభుత్వం ఆలోచనలు పెడదారి పట్టిపోతోంటే.. వారిని ప్రతిపక్షం ఎలర్ట్ చేయడం సమాజానికి అవసరం. అయితే.. విస్తృతకోణాల్లో పరిశీలించినప్పుడు నలుగురికీ ఉపయోగపడే నిర్ణయాల గురించి కూడా వక్రంగా ఆలోచిస్తూ.. ఏదో ప్రజల కోసం పోరాడుతున్నట్టుగా బిల్డప్పులు ఇస్తూ పోరాటాలు, నిరసనలు తెలియజేయడం వారినే అభాసు పాలుచేస్తాయి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీల తీరు కూడా అలాగే కనిపిస్తోంది. మండలిలో తాజాగా కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. మూడు బిల్లుల విషయంలో మౌనంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలు.. కార్మికుల పనిగంటల పెంపు, మహిళలు రాత్రి వేళల్లో కూడా పనిచేయడానికి అవకాశం కల్పిస్తూ ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ బిల్లు ను కార్మిక శాఖ మంత్రి ప్రతిపాదించినప్పుడు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
బిల్లును పునస్సమీక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల పనిగంటల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. 8 గంటల స్థానే పదిగంటల పని చేయించుకోవడం కార్మికలోకానికి ద్రోహం చేస్తున్న స్థాయిలో వారు అభివర్ణించి నిరసనలు తెలిపారు. అలాగే.. మహిళలు నైట్ డ్యూటీలకు అనుమతిస్తే.. వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు పూచీ వహిస్తారు అంటూ వక్రమైన వాదనలను లేవనెత్తి అభ్యంతరం తెలిపారు. ఈ వాదనలు కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి తప్ప.. సబబైనవి కాదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
8 నుంచి 10 కు పనిగంటలను పెంచడం వలన.. వారానికి ఆరు రోజులు పనిచేస్తున్న కార్మికులు, ఇకపై శని, ఆదివారాలు రెండు రోజులూ సెలవు తీసుకుని తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం తరఫున మంత్రి వివరణ చెప్పినా కూడా.. వైసీపీ ఎమ్మెల్సీలు శాంతించలేదు. నిజానికి పని గంటల పెంపు అంటే.. ఆ నిర్ణయాన్ని సగం మాత్రమే అర్థం చేసుకున్నట్టు. వారానికి శని, ఆది రెండురోజులూ సెలవు ఇవ్వడం అనేది ఈ బిల్లులోని అసలు మర్మం. అయితే వైసీపీ ఎమ్మెల్సీలు వక్రంగా ప్రచారం చేస్తూ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. కార్మికలోకం ఆమోదిస్తున్న వాటి గురించి వీరిలా వితండంగా నిరసన చెప్పడం వలన.. వారే అభాసుపాలవుతున్నారు. ఇలాంటి వాదనలతో ప్రజల మనసు గెలుచుకోలేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.