రాజధాని అమరావతి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన కుట్రలు ఒకటి కాదు!అందులో భాగంగానే ఆర్ 5 జోన్ కూడా అప్పట్లో తెరమీదకు వచ్చింది. ఎక్కడెక్కడినుంచో 43 వేల మంది లబ్ధిదారుల్ని ఎంపికచేసి.. వారందరికీ రాజధాని అమరావతిలో వేర్వేరు ప్రాంతాల్లో సెంటు భూమి ఇళ్లస్థలాలు ఇస్తున్నాం అంటూ జగన్ పెద్ద డ్రామా నడిపించారు. ఆ రకంగా అమరావతి రాజధాని అనే స్వప్నాన్ని శాశ్వతంగా చిదిమేయాలని జగన్ అనుకున్నారు. అమరావతి విధ్వంసానికి జగన్ పడిన కష్టాల్లో ఆర్ 5 జోన్ కూడా ఒకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు ఆర్ 5 జోన్ వివాదానికి శాశ్వతంగా తెరదించేశారు. అలాగని అక్కడ సెంటుభూమి ఇంటి స్థలాలు పొందిన ఒక్క నిరుపేద వ్యక్తి కూడా నష్టపోకుండా ప్రత్యామ్నాయాలు చూసిన తర్వాతనే.. చంద్రబాబు సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జగన్ తన పరిపాలన కాలంలో.. ప్రజలకు సంక్షేమం పేరుతో డబ్బు పంచిపెట్టడం ఎలా ప్రధానంగా భావించారో.. అలాగే.. అమరావతి విధ్వంసాన్ని కూడా తన లక్ష్యంగా నిర్దేశించుకుని ప్రతి అడుగు అందుకోసం వేశారు. అనేక కుట్రలు చేశారు. అమరావతి ప్రాంతంలో అయిదేళ్లలో ఒక్క ఇటుక పెట్టి నిర్మాణం చేయకపోగా.. పేదలకు సెంటు స్థలాలు ఇస్తానంటూ ఎక్కడెక్కడి వారినో తీసుకువచ్చి.. వారికి 43వేల ఇళ్ల పట్టాలు పంచేశారు. వారికి ఇళ్లు కూడా కట్టేసి.. అసలు అమరావతి కలల రాజధాని రూపాన్ని శాశ్వతంగా చెరపివేయాలని జగన్ అనుకున్నారు. కానీ.. న్యాయపరమైన చిక్కుల కారణంగా.. పట్టాలివ్వగలిగారు గానీ.. నిర్మాణాలు మొదలు కాలేదు. అక్కడికే కొన్ని వందల కోట్ల రూపాయలు తగలేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ లబ్దిదారులు అందరికీ తమ తమ ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా, లేదా, టిడ్కో ఇళ్లు కేటాయించేలా కొత్త నిర్ణయం తీసుకున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు అవాంతరం కలగకుండా ఆర్ 5 జోన్ ను రద్దు చేసేశారు. లబ్ధిదారులు కూడా చంద్రబాబు నిర్ణయం పట్ల సంతోషంగా ఉండడం గమనార్హం.
అయితే అమరావతి విధ్వంసానికి తాము చేసిన కుట్రలు ఇలా చెల్లాచెదురయ్యేసరికి వైసీపీ ఉడికిపోతున్నది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ఆర్ 5 జోన్ కేటాయింపుల రద్దును తప్పు పడుతున్నారు. అమరావతికోసం పేద రైతుల పొలాలు తీసుకుని, అదే పేదలు ఉండొద్దంటే ఎలా అని మొసలి కన్నీరు కారుస్తున్నారు. స్థలాలు ఇచ్చిన పేదరైతుల కడుపుకొట్టే పనులు చేసింది ఎవరో ప్రజలు మొన్నటి ఎన్నికల్లోనే తీర్పు చెప్పారు. అయినా సరే.. వైసీపీ వారు మాత్రం తమ కుట్రలు విఫలమయ్యాయని విలపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.