మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సాహసం చేశారు. సెకితో ఒప్పందాల ముసుగులో అదానీ నుంచి 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా వస్తున్న ఆరోపణలపై దూకుడైన ముందడుగు వేశారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కు 1750 కోట్ల లంచం ఇచ్చినట్టుగా అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ తమ నివేదికలో పేర్కొంది. దానికి అనుబంధంగా.. ఏపీలోని వార్తాపత్రికలు కూడా పలుకథనాలను అందిస్తున్నాయి. అయితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల మీద పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వారిద్దరి మీద వంద కోట్లరూపాయలకు ఆయన పరువు నష్టం దావా వేశారు. దావా వేయడం వరకు ఓకే. కోర్టులో ఈ పరువు నష్టం నెగ్గకపోతే గనుక.. తనకు అసలు పరువు లేదని, అదానీ నుంచి తాను లంచాలు తీసుకున్న మాట నిజమే అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా? అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల మనసుల్లో ప్రశ్నగా మెదలుతోంది.
సెకితో విద్యుత్తు ఒప్పందాలు కుదురుతున్న సమయంలోనే తెలుగు పత్రికల్లో ఆ వైనంపై అనేక పరిశోధనాత్మక కథనాలు వచ్చాయి. అయినా సరే అడ్డదారుల్లో పావులు కదిపిన జగన్ సర్కారు.. అప్పటి విద్యుత్తు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా పక్కన పెట్టి కేబినెట్ తీర్మానం ద్వారా హడావుడిగా ఒప్పందాలు చేసుకుంది. ఒప్పందం ధరలపై అప్పట్లోనే విమర్శలు వస్తే.. అత్యంత చవక ధరలు అంటూ బుకాయించింది. తీరా అమెరికాలో ఎఫ్బిఐ నివేదకల్లో లంచాల సంగతి తేలిన తర్వాత బండారం మొత్తం బయటపడింది.
దానికి తగ్గట్టుగా అప్పట్లో ఒప్పందాలు ఎలా జరిగాయో.. అప్పటి విద్యుత్తు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. అప్పట్లో ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక పెద్దరెడ్డి అంతా తానై ఒప్పందాలు నడిపించారని అన్నారు. పత్రికలు కూడా మొత్తం ఒప్పందాల బాగోతాన్ని బయటపెట్టాయి. ఇవన్నీ జగన్ కు కంటగింపుగా మారింది. బాలినేని మీద కేసులు వేస్తే.. కొరివితో తల గోక్కున్నట్టు అవుతుందని, తమ ప్రభుత్వకాలంనాటి బండారాలు మరిన్ని బయటకు వస్తాయని ఆయన భయపడ్డారేమో గానీ.. ఆయనను వదలిపెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతిలను మాత్రం 48 గంటల్లోగా సంజాయిషీలు ఇవ్వకుంటే పరువునష్టం దావా వేస్తా అంటూ బెదిరించారు.
సహజంగానే ఆ రెండు పత్రికలు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి సాహసించి.. ఆ ఇద్దరిపై వంద కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ దైర్యం బాగుంది. మరి దావా ఓడిపోతే ఏం చేస్తారు? తాను తప్పు చేసినట్టే అని ఒప్పుకుంటారా? అనేది ఇప్పుడు ప్రజల ప్రశ్న. జగన్.. తమ వద్ద జవాబుందా?