ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అమరావతిలో రైతులనుంచి కొనుగోలు చేసిన ఐదు ఎకరాల స్థలంలో ఈ భవనం నిర్మిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అమరావతి రాజధాని పనులను ప్రారంభించిన తరువాతే.. అమరావతిలోనే తాను సొంత ఇంటిని నిర్మించుకుంటానని ప్రకటించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులన్నింటినీ కార్యరూపంలో పెట్టిన తర్వాత.. తన ఇంటికోసం కొనుగోలు చేసిన స్థలంలో కుటుంబ సమేతంగా పాల్గొని శంకుస్థాపన చేశారు. అయితే తమాషా ఏంటంటే.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజధాని నగరంలో ఇల్లు నిర్మించుకుంటూ ఉంటే కూడా.. జగన్ దళాలు ఆ వ్యవహారంపై పడి ఏడుస్తున్నాయి. ఆయన కరపత్రిక, చానెళ్లు చంద్రబాబు ఏదో అన్యాయం చేసినట్టుగా శోకాలు పెడుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి.. తను అధికారంలో ఉన్న రోజుల్లో కుటిల విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారు. 2019కి ముందు తాడేపల్లిలో ఓ ప్యాలెస్ కట్టుకుని తన నివాసమే అక్కడకు వచ్చిన తర్వాత.. రాజధాని కూడా అక్కడే ఉన్నట్టే కదా.. అంటూ తన పార్టీ వారితో మాట్లాడించి.. అమరావతికి జగన్ సానుకూలం అనే భ్రమ కల్పించి.. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత అమరావతి రైతుల్ని మోసంచేస్తూ మూడు రాజధానుల కాన్సెప్టు తెచ్చారు. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు రాజధానిలో సొంత ఇళ్లు లేవని, వారిని గెలిపిస్తే రాష్ట్రంలో అద్దె ఇళ్లలో ఉంటారు.. లేకపోతే పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోతారని పదేపదే ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందే సొంత ఇల్లు నిర్మించుకోగా, చంద్రబాబు మాత్రం.. అమరావతి పనులు మొదలయ్యాక అక్కడే తన ఇల్లు కట్టుకుంటానని స్పష్టం చేశారు.
దానికి తగ్గట్టుగానే రైతుల నుంచి అయిదు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులోనే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐదెకరాల్లో 25వేల చదరపు గజాల్లో చంద్రబాబునాయుడు భవంతి కడుతున్నారంటూ జగన్ దళాలు కుటిల ప్రచారం సాగిస్తున్నాయి. జగన్ ఇరవై అడుగుల ప్రహరీలతో జైలు గోడలను తలపించేలా తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నారు. నరమానవులకు ఎంట్రీ ఉండని పటిష్టమైన జైలులాంటి బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో గడుపుతుంటారు. అలాంటిది.. ఐదెకరాల్లో విశాలమైన ఖాళీజాగా వదిలేసి, సర్వెంటు క్వార్టర్స్ అన్నీ కూడా కట్టించుకుంటూ.. ఒక ఎకరం మించకుండా చంద్రబాబునాయుడు సొంత ఇల్లు కట్టుకుంటూ ఉంటే దాని మీద కూడా విషం చిమ్మడం చిత్రంగా కనిపిస్తోంది. ప్రభుత్వం మీద ఇతరత్రా విమర్శలు చేయడానికి ఏమీ కనిపించక, వైసీపీ ఇంటి నిర్మాణం మీద కూడా కుటిల ప్రచారం చేస్తున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.