వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అయిదేళ్లు పాటూ ముఖ్యమంత్రిగా అరాచక పాలన సాగించిన రోజుల్లో.. అరాచకత్వానికి అంతే లేదు. అప్పట్లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల పర్వంలో రాష్ట్రవ్యాప్తంగా అరాచకత్వానికి కొత్త నిర్వచనాలు రుచిచూపించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన వారు ఎక్కడ నామినేషన్లు వేయబోయినా అడ్డుకున్నారు. కార్యాలయాల వద్దకు వచ్చిన వారినుంచి నామినేషన్ కాగితాలు లాక్కుని చించేశారు. వారిని కొట్టారు. కిడ్నాపులు చేశారు. పోలీసులతో నిర్బంధింపజేశారు. ఇన్ని అరాచకాలు చేసి రాష్ట్రమంతా తామే గెలిచినట్టు చాటుకున్నారు. అయితే కడపజిల్లాలో జగన్ అంత అరాచకం చేయాల్సిన అవసరం లేదు. సొంత జిల్లా గనుక.. ఆయనకు అక్కడ బలం ఎక్కువే. తక్కువ అరాచకత్వంతోనే నెగ్గారు. చాలా వరకు వారికే దక్కాయి. అలాంటి వాటిలో కడప నగరపాలక సంస్థ కూడా ఒకటి. తర్వాతి పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. జగన్ సొంత జిల్లా కడపలో కూడా అత్యంత అవమానకరమైనరీతిలో పరాజయాలను మూటగట్టుకుంది. కానీ.. కడప మునిసిపాల్ కార్పొరేషన్ లోని వైసీపీ పాలకవర్గానికి మాత్రం అహంకారం వీసమెత్తు కూడా తగ్గలేదు. అత్యంత వివాదాస్పదమైన రీతిలో వ్యవహరిస్తున్నారు. తమ పార్టీని మరింతగా భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ దళాలకు చింతచచ్చినాకూడా పులుపు చావలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఇంతకూ కడప కార్పొరేషన్ లో ఏం జరిగిందంటే..
కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో తెదేపా ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిల్చుని మాట్లాడుతూ నిరసన తెలియజేశారు. ఆమె మాట్లాడుతుండగానే.. కడప మేయర్, వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్స్ అఫీషియో మెంబరు హోదాలో తనకు మాట్లాడే అధికారం ఉందంటూ మాధవి గట్టిగా పట్టుబట్టారు. చాలా సేపు గందరగోళం నెలకొంది.
మాధవీరెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పాలకవర్గం తీరు గురించి మండిపడ్డారు. ‘మహిళను అవమానిస్తారా? మీరు అవమానించినా సరే.. కుర్చీ లాగేసినా సరే.. ప్రజలు నాకు ఇంకా గౌరవప్రదమైన ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చారు. కుర్చీలకోసం పోరాడాల్సిన ఖర్మ నాకు లేదు’ అంటూ ఆమె రెచ్చిపోయారు. సమావేశం మొత్తం నిల్చుని మాట్లాడగల శక్తి నాకుంది.. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో మిమ్మల్నే చూస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేకు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అవకాశం ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు. వైసీపీ పార్టీని ప్రజలు దారుణంగా ఓడించినా కూడా వారికి కనీసం ఆలోచన, జ్ఞానం, సంస్కారం రాలేదని ప్రజలు అనుకుంటున్నారు.