చంద్రబాబునాయుడు ప్రభుత్వం సోమవారం నాటినుంచి ఉచితంగా ఇసుక అందజేయనున్నట్టు ప్రకటించింది. లాంఛనంగా ఆరోజున ప్రారంభించారు. మంగళవారం నుంచి రెగులర్ గా ఉచిత ఇసుక విక్రయాలు ఉంటాయి. తవ్వకం- లోడింగ్ ఖర్చులు, సీనరేజీ చార్జీలు మాత్రం తీసుకుంటారు. అయితే.. ప్రభుత్వం పేదలకు తోడ్పాటు అందించాలని, రాష్ట్రంలో భవన నిర్మాణరంగం శరవేగంతో పరుగులు తీయడానికి వీలుగా ఈ ఏర్పాటు చేస్తే.. అప్పుడే కొనుగోళ్లలో దందాలు మొదలైపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా కొత్త ఇసుక విధానానికి సమగ్ర రూపకల్పన చేయనేలేదు. ఈలోగా తాత్కాలిక ఏర్పాటులో ఉన్న లొసుగులను వాడుకుని.. అక్రమదందాలు కొనసాగించడానికి పలువురు సిద్ధపడిపోయారు. గత అయిదేళ్ల పాటూ ఇసుక అక్రమ దందాలతో చెలరేగిపోయిన వారు.. వక్రమార్గాల్లో ఇప్పుడు కూడా అదే పని చేయడానికి ఎగబడుతున్నారు.
ఒక ఆధార్ కార్డు మీద రోజుకు 20 టన్నుల ఇసుకమాత్రం ఇస్తాం అని, ఆ మేరకు వచ్చి ఖర్చులు మాత్రం చెల్లించి ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మంగళవారం తెల్లవారు జాము సమయానికే ఇసుక నిల్వ పాయింట్ల వద్ద పెద్ సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు బార్లు తీరిపోయాయి. ఎవరెవరివో ఆధార్లు, ఫోను నెంబర్లు తెచ్చి.. ఇసుక కోసం ఒత్తిడి చేస్తున్నారు. అసలు వారందరూ భవన నిర్మాణాలు చేస్తున్న వారేనో కాదో కూడా తెలియదు. వీరిలో చాలామంది ఇసుక తీసుకువెళ్లి.. అక్రమంగా పట్టణాల్లో బ్లాకులో అమ్ముకునే వారే అనే ప్రచారం కూడా నడుస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అక్రమార్కులు చెలరేగిపోతారని అంతా అంటున్నారు.
– బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉన్న వారికి ఆ భవనానికి అవసరమైన ఇసుక లెక్కవేసి ఆ మేరకు మాత్రమే ఇసుక సరఫరా చేయాలి.
– బిల్డింగ్ అప్రూవల్ తో ముడిపడి ఉన్న ఆధార్ నెంబరు ద్వారా మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతించాలి.
– ఆధార్ నెంబరుకు లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే డిజిటల్ రూపేణా నగదు చెల్లింపు జరగాలి.
– బిల్డింగ్ అప్రూవల్ లేకుండా ఇసుక కోసం వస్తే ఒక ఆధార్ కార్డుకు రోజుకు 5 టన్నులకు మించి ఇవ్వకూడదు.
– అప్రూవల్ లేకుండా 5 టన్నులకు మించి ఇసుక కావాలని అడిగేవారికి ఇసుకను ప్రత్యేక ధరకు విక్రయించాలి.
ప్రభుత్వం కొత్త ఇసుక విధానం రూపొందించేప్పుడు.. ఇలాంటి కనీస జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైసీపీ పాలనలో చెలరేగిన అక్రమార్కులు తమ దందాను ఇప్పుడు కూడా కొనసాగించకుండా ఉండాలంటే ఇలాంటి మరిన్ని జాగ్రత్తలు తప్పదంటున్నారు.