వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే తన ప్రధాన అజెండాగా చెలరేగిపోయిన ఐదేళ్ల కాలంలో ఆ ప్రభుత్వంలో నెంబర్ టు గా హవా నడిపించిన మంత్రివర్యులు ఆయన. ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మించి తన మాట చలాయించుకోగలిగిన అతి బలమైన నాయకుడిగా ఆయన గురించి పార్టీ వర్గాలలో అతిశయంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదేళ్ల పదవీకాలంలో అపరిమితమైన భూదాహంతో చెలరేగిపోయారని ఇప్పుడు ఒక్కొక్క వివరమూ బయటకు వస్తోంది. ఖాళీగా ఉన్న భూముల మీద తన కన్ను పడితే చాలు అవి ప్రభుత్వ భూములా? అటవీ భూములా? మఠాలకు చెందిన భూములా? అనే విచక్షణ, పట్టింపు ఏమీ లేకుండా విచ్చలవిడిగా ఏదో ఒక వక్రమార్గాలలో వాటిని సొంతం చేసుకునే పెద్దిరెడ్డి అరాచకత్వం ఇప్పుడు బహుముఖాలుగా వెలుగులోకి వస్తున్నది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉండే 27.70 ఎకరాల ప్రభుత్వ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య స్వర్ణలత పేరు మీద నకిలీ, ఫోర్జరీ పత్రాలతో ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించేశారు. అయినా ఎంత నిర్భయంగా చెలరేగిపోయారంటే 2024 ఎన్నికల అఫిడవిట్లో కూడా 5.25 కోట్ల విలువైన ఆ భూములను తన సొంత భూములుగా ఆస్తుల కింద చూపించారు.
అయితే నిజానికి ఈ ప్రభుత్వ భూములను ఆరుగురు మాజీ సైనికులకు 2004-2008 మధ్యలో ప్రభుత్వం అసైన్ చేసినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించారు. వారి నుంచి తన భార్య పేరిట కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆయన తెలివితేటలకు పరాకాష్ట. మాజీ సైనికులకు ఆ భూములు ప్రభుత్వం ఇచ్చినట్లుగా తయారైన పత్రాలు.. నకిలీవి అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించిన నేపథ్యంలో పెద్దిరెడ్డి అరాచక భూస్వాహా వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.
ఆయన ఆక్రమించుకున్న 27 ఎకరాలలో 15 ఎకరాలకు పైగా జిల్లా యంత్రాంగం ఇప్పటికే తిరిగి స్వాధీనం చేసుకుంది. కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నందువలన మిగిలిన భూమి స్వాధీనం ఆలస్యం అవుతోంది. ఆయన భూకబ్జాలకు అడ్డదారుల్లో సహకరించిన ఒక తహసీల్దారు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, మరో పదకొండు మంది అధికారులపై నేర అభియోగాలు నమోదు అయ్యాయి. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం ఫోర్జరీ తదితర వ్యవహారాలపై ఏర్పేడు తహసీల్దారు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది.
పెద్దిరెడ్డి భూదాహం అపరిమితమైనదని ఈ బాగోతం చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే తిరుపతి పరిసరాలలో మఠం భూములను అటవీ భూములను కూడా కబ్జా చేసిన వేర్వేరు కేసులను పెద్దిరెడ్డి ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వ భూమిని నకిలీ ఫోర్జరీ పత్రాలతో కాజేసిన కేసు కూడా వాటికి జత అవుతోంది. ప్రస్తుతం ఆయన కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ భూకబ్జా కేసులు విచారణ పర్వం మొదలైతే తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా త్వరలో జైలుకు వెళ్ళకు తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.