గత అయిదేళ్లుగా ఎమ్మెల్యే మరియు మంత్రిగా రోజా వ్యవహార సరళిని గమనించిన ఎవ్వరికైనా సరే.. ఆమెకు ఎంత అపారమైన దైవభక్తి ఉన్నదో కదా అని నివ్వెరపోతారు. ఎందుకంటే ఆమె దాదాపుగా ప్రతినెలలోనూ కనీసం ఒక్కసారి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళతారు. ఎంతగా ప్రోటోకాల్ వైభవ దర్శనాలకు అవకాశం ఉన్నప్పటికీ వీవీఐపీ స్థాయిల్లో బాధ్యతలమధ్య నలుగుతుండే వారికి ప్రతినెలా తిరుమల దర్శనానికి వెళ్లేంత వెసులుబాటు ఉండడం కష్టం. కానీ ఆమె ప్రతినెలా తిరుమల వెళ్లేవారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా.. రోజా తిరుమల దర్శనానికి వెళ్లాలంటే ఇబ్బందేం ఉండదు. కానీ.. ఆమె ప్రతినెలా వెళ్లడం మాత్రం జరగకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వెనుక ఒక సీక్రెట్ ఉంది.
లోకల్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రోటోకాల్ దర్శనాలు ఉన్నప్పడు.. ఒక ప్రత్యేకమైన హక్కు వారికి ఉంటుంది. తమ వెంట పెద్ద సంఖ్యలో అనుచరుల్ని, ఆత్మీయుల్ని దైవదర్శనానికి తీసుకువెళ్లడానికి వీలుంటుంది. సాధారణంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు ఇచ్చే అధికారం కూడా టీటీడీలో ఉంటుంది. వాళ్లందరూ ఈ సిఫారసు లేఖల్ని అమ్ముకుంటూ విపరీతంగా దందాలు చేస్తుంటారు. సాధారణ వీఐపీ బ్రేక్ ఒక్కొక్కటి పదివేలకు పైగానే తిరుమలలో ధర పలుకుతుంటుంది.
ఎమ్మెల్యేతో కలిసి ప్రోటోకాల్ స్పెషల్ వీఐపీ బ్రేక్ దర్శనం అంటే దాని ధర మామూలుగా ఉండదు. సరైన పార్టీ దొరికితే ఒక టికెట్ కు లక్షరూపాయలు కూడా ఇచ్చేవారుంటారు. ఎమ్మెల్యేగా రోజా.. ఈ ఆదాయమార్గాన్ని కీలకంగా ఎంచుకున్నారనే ఆరోపణలున్నాయి. రోజా తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతిసందర్భంలోనూ ఆమె వెంట బోలెడు మంది ‘అనుచరులు, ఆత్మీయులు, కుటుంబసభ్యులు’ వెళుతుంటారు. ఆమె దర్శనానికి వెళ్లే ప్రతిసారీ .. వెంటవెళ్లే ఈ బ్యాచ్ మారుతూ ఉంటుంది. తిరుమల దర్శనాల విషయంలో రోజా సొంతంగా నియమించుకున్న దళారీలు ఈ ‘బ్యాచ్’ను ఏర్పాటు చేస్తుంటారు. ఎమ్మెల్యేగా ఉన్నరోజుల్లో అయితే.. ఈ దర్శనాల ద్వారా వచ్చేదే రోజాకు నెలవారీగా అన్నింటికంటె పెద్ద ఆదాయవనరుగా ఉండేదని పుకార్లుండేవి.
ఇప్పుడు రోజా మాజీ ఎమ్మెల్యే అయ్యారు. ఆమె స్వయంగా వెళ్లాలంటే ఒకరిద్దరి వరకు వెంట తీసుకువెళ్లడానికి నిబంధనలు అనుమతించవచ్చు. అంతే తప్ప గతంలోలాగా పదుల సంఖ్యలో బ్యాచ్ లను తీసుకెళ్లడం కుదరదు. కాబట్టి.. ఇదివరకటి లాగా.. ప్రతినెలా తిరుమల దర్శనానికి వెళ్లే అలవాటును రోజా ఇకమీదట కూడా కొనసాగిస్తారా? లేదా? అనే సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. పాపం.. ఎమ్మెల్యే పదవి పోవడం కాదుగానీ, రోజా ప్రధాన ఆదాయవనరు కోల్పోయిందని జనం సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.