నా తల్లినీ అవమానిస్తారా? : షర్మిల

‘నేను వైఎస్ షర్మిలారెడ్డినే కాదంట. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదంట. నా తల్లి విజయమ్మను కూడా అవమానిస్తున్నారా?’’ అంటూ వైఎస్ షర్మిల సాగిస్తున్ ప్రసంగాలు ఇప్పుడు.. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ప్రజలను పునరాలోచనలో పడేస్తున్నాయి. జగన్ ప్రోద్బలంతో.. ఆయన అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తన మీద తీవ్రమైన నిందలు వేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిని కూడా రోడ్డుకీడుస్తూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలతో షర్మిల మనోవేదనకు గురవుతున్నారు.


ఈ వైనం ప్రజల్లో కొత్త ఆలోచనలకు బీజం వేస్తోంది. కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే జనం పెద్దసంఖ్యలోనే ఉంటారు. కనుకనే.. ఆయన కొడుకుగా జగన్ పార్టీ పెట్టిన తర్వాత.. ఆ జిల్లా అంతటా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికి కూడా.. జగన్ కు బాగా బలంగా ఉండే జిల్లాల్లో కడప కూడా ఒకటి. జగన్ ను అక్కడి ప్రజలు ఆమోదిస్తున్నారంటే.. కేవలం వైఎస్సార్ కొడుకు కావడం వల్ల మాత్రమే. అలాంటిది ఇప్పుడు వైఎస్సార్ కుటుంబాన్ని, వైఎస్సార్ భార్యను అవమానించేలా.. జగన్ అనుచరులు పెట్రేగి మాట్లాడితే.. ఆయన అభిమానులు ఎందుకు సహిస్తారు.?


అదే సమయంలో వైఎస్సార్ కొడుకుగా జగన్ కు వారి దృష్టిలో ఎలాంటి విలువ ఉంటుందో, కూతురుగా షర్మిలకు కూడా అలాంటివిలువే ఉంటుంది. మరి ఆమెకు కూడా ఎంపీ ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చి తీరాల్సిందేనని..  ఈరీతిగా ఆమె తల్లిని కూడా అవమానించే వ్యాఖ్యలు చేస్తున్న వారికి బుద్ధిచెప్పేలా ఓటు వేయాలని వారు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.


మొత్తానికి తన అనుచరుల ద్వారా షర్మిలపై ఎదురుదాడికి జగన్ పురమాయించిన అనుచరులు.. సెల్ఫ్ గోల్ వేసేసినట్టే కనిపిస్తోంది.


నిజానికి షర్మిల రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తున్నారు. అవినాష్ రెడ్డి తన చిన్నాన్నను హత్య చేశాడని, ఆ హంతకుడిని తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులకు చేతనైతే ఈ రాజకీయ, నేరారోపణలకు జవాబు ఇవ్వాలి. అంతే తప్ప.. షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు రువ్వడం అనేది నీతిబాహ్యమైనది. షర్మిల పుట్టుకను అనుమానించేలా, వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మల పరువును కూడా బజారుకీడ్చేలా ఆ విమర్శలు ఉన్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవి. అయితే జగన్ ప్రోద్బలం లేకుండా తనను, తన తల్లిన అంతమాట అనగల ధైర్యం వారికి వస్తుందా? అనేది ఇప్పుడు షర్మిల సంధిస్తున్న ప్రశ్న. 

Related Posts

Comments

spot_img

Recent Stories