ఆమంచి రాజీనామాతో వైసీపీకి గడ్డురోజులేనా?

మొన్నమొన్నటి వరకు పరుచూరు నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్నప్పటికీ కూడా టికెట్ దక్కించుకోలేకపోయిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బాపట్ల జిల్లాలోనే వైసీపీకి ఇది పెద్ద దెబ్బగా పలువురు భావిస్తున్నారు. రెండు మూడు నియోజకవర్గాల్లో విస్తృతమైన ప్రజాబలం ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఈ సమయంలో పార్టీని వీడిపోవడం అనేది వైసీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. కాగా, 9వ తేదీన తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఆమంచి చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారా? లేదా, ఇండిపెండెంటుగా పోటీచేస్తారా అనేది ఇంకా తెలియలేదు.

ఆమంచి కృష్ణమోహన్ సొంత బలం ఉన్న నాయకుడు. 2009లో కాంగ్రెస్ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యే అయిన ఆమంచి, 2014 లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. సొంతంగా నవోదయం అనే పార్టీ పెట్టుకున్నారు. రాష్ట్రమంతా.. అటు తెలుగుదేశం ఎన్డీయే కూటమి, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ లమధ్య స్పష్టంగా విడిపోయి తీర్పు చెప్పగా.. ఒక్క చీరాలలో మాత్రం ఆమంచి కృష్ణమోహన్ తన సొంత బలంతో నెగ్గారు. తర్వాత పరిణామాల్లో తెలుగుదేశంలో చేరారు.

చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించారు గానీ వర్కవుట్ కాలేదు. 2019లో ఆ పార్టీని వదలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీరాల బరిలో నిలిచి, తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. కానీ, బలరాం గెలిచిన తర్వాత వైసీపీలో చేరడంతో.. నియోజకవర్గంలో రెండు వర్గాల కుమ్ములాటలు మొదలయ్యాయి. చీరాల సీటు విషయంలో కరణం బలరాంను తప్పించలేని జగన్, ఆమంచిని పర్చూరుకు ఇన్చార్జిగా పంపారు. ఇన్నాళ్లు అక్కడ పార్టీ పని చేసినప్పటికీ.. ఆమంచికి టికెట్ రాలేదు. ఆయన ఆగ్రహించి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేశారు.

అయితే ఇప్పుడు ఆమంచి తెలుగుదేశంలో చేరుతారా? లేదా ఇండిపెడెంటుగా పోటీచేస్తారా? అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే.. ఆయన ఇండిపెండెంటు అయితే ఇతర నియోజకవర్గాల మీద పెద్ద ఫోకస్ పెట్టలేకపోవచ్చు గానీ.. తెదేపాలో చేరితే చీరాల, పరుచూరులతో పాటు మరికొన్ని నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగలరని సమాచారం. ఆమంచి మాత్రం ఇండిపెండెంటుగా తన బలాన్ని పరీక్షించుకోవడానికే సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories