ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల అతిపెద్ద మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకూ కొత్త నిందితుల పాత్ర కూడా వెలుగుచూస్తుండడం ఒక ఎత్తు అయితే, కేసులోతుల్లోకి వెళుతున్న కొద్దీ.. విచారణ మరింత విస్తృతంగా సాగాల్సిన అవసరం కనిపిస్తుండడం మరో ఎత్తు. తాజాగా గమనిస్తే.. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. జగన్ నడిపించిన లిక్కర్ స్కామ్ గురించి విదేశాల్లోకూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని కోరుతున్నారు. లిక్కర్ కుంభకోణం ద్వారా ముడుపుల రూపంలో కాజేసిన నల్లధనాన్ని హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో వర్ల డిమాండ్ సహేతుకమే అనే వాదన వినిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో పురుడు పోసుకున్న కొత్త మద్యం పాలసీ ద్వారా వేలకోట్లరూపాయలు డిస్టిలరీలనుంచి వాటాలుగా కాజేశారనే సంగతి తేలింది. ఏ రూపంలో లిక్కర్ కుంభకోణం జరిగిందో.. ఎంత కాజేశారో సిట్ లెక్కతేల్చిన తర్వాత తెలుగుదేశం ఎంపీ, లోక్సభా పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్ సభలో ఆ విషయం ప్రస్తావించారు. కుంభకోణం ఎలా చోటు చేసుకున్నదో వివరించారు. మద్యం కుంభకోణంలో కాజేసిన వందల కోట్లరూపాయల అవినీతి సొమ్మును దుబాయికి చెందిన ఇన్ ఫ్రా కంపెనీలలో హవాలా రూపంలో పెట్టుబడులుగా తరలించినట్టు కూడా లావు వెల్లడించారు. లావు చెప్పిన వివరాలతో షాక్ కు గురైన హోంమంత్రి అమిత్ షా.. మరునాడు ఆయనను ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకుని మరింతగా వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఈడీ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని కూడా లావు కృష్ణదేవరాయలు అమిత్ షాను కోరారు.
ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణంలో ఏ1 కెసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తాము విచారించేందుకు అప్పగించాల్సిందిగా ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ రంగంలోకి రావడం అంటేనే హవాలా కార్యకలాపాలపై దృష్టి సారించినట్టే. అసలే వసూలుచేసిన అవినీతి సొమ్మును భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీ తెలివితేటలతో డొల్ల కంపెనీలు, సూట్ కేసు కంపెనీల్లోకి మళ్లించారని ఇప్పటికే సిట్ విచారణలో తేల్చింది. ఈ కంపెనీలతో పాటు దుబాయి కేంద్రంగా ఇన్ ఫ్రా కంపెనీల్లోకి కూడా తరలించినట్లు లావు కృష్ణదేవరాయలు ఆధారాలు కూడా అమిత్ షాకు సమర్పించారు. ఇలాంటి నేపథ్యంలో.. వర్ల రామయ్య కోరుతున్నట్టుగా లిక్కర్ కుంభకోణం అవినీతి ఎన్ని దేశాలకు విస్తరించి ఉన్నదో తేల్చి.. మొత్తం అందరు దోషులను తేల్చడానికి విదేశాల్లో కూడా దర్యాప్తు సాగే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.