ఆయన ఇక ఎంత మాత్రమూ కాపు నాయకుడు కాదా? తన పేరు చివర ‘రెడ్డి’ అనే పదాన్ని తగిలించుకుని- రెడ్డిగా మారిపోయిన ముద్రగడ పద్మనాభం- రెడ్డి కులానికి చెందిన వ్యక్తిగానే కొనసాగబోతున్నారా? ఆయన ఇప్పుడు ‘కాపు’ కాదు గనుక కాపు జాతి కోసం చేసే పోరాటాలను విడిచిపెడతారా? అనే చర్చోప చర్చలు రాజకీయ వర్గాలలో జరుగుతున్నాయి! ఈ సరికొత్త ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’ కాపులను బీసీల్లో చేర్చడం కోసం పోరాడుతానని అంటే.. అది పోరాటంలాగా కాదు కదా, కామెడీగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కాపు ఉద్యమ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. ఎన్నికలకు ముందు చాలా డోలాయమాన పరిస్థితిలో ఉన్నారు. ఆయనతో జనసేన నాయకులు సంప్రదింపులు జరిపారు. పవన్ కల్యాణ్ ఆయన ఇంటికి వస్తారని, ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం తొలుత వచ్చింది. బేరం ఎక్కడ చెడిందో తెలియదు గానీ.. ఆయన జనసేనలో చేరలేదు సరికదా.. పవన్ మీద నిప్పులు చెరగడం ప్రారంభించారు.
ఈలోగా ఆయన వద్దకు వైఎస్సార్ సీపీ బేరగాళ్లు కూడా వెళ్లారు. పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని కాపు ఓటు బ్యాంకును కూటమికి అనుకూలంగా మార్చగలరనే ప్రచారం నేపథ్యంలో కాపు నాయకుడు ముద్రగడను వైసీపీలో చేర్చుకున్నారు. జగన్ ను మళ్లీ సీఎం చేస్తానని హామీ ఇచ్చిన ముద్రగడ, అలా జరిగితే.. తాను రాజ్యసభ సభ్యత్వం అడగాలని కోరుకున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ బరిలోకి దిగిన తర్వాత.. ఎన్నికల ప్రచార సమయంలో మరో భీషణ ప్రతిజ్ఞ చేశారు. పిఠాపురంలో పవన్ ను ఓడించి తీరుతానని, అలా చేయకపోతే.. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అన్నారు.
ఇప్పుడు అదే జరిగింది. పవన్ అఖండమైన విజయం తర్వాత.. ముద్రగడ పద్మనాభం.. పేరు మార్చుకోవడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం ఈ మేరకు ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారింది. పేరు చివర రెడ్డి అని చేర్చుకుని ఉండవచ్చు గానీ.. ఆయన కులం కాపుగానే ఉంటుంది. అయితే, ఈ కొత్త రెడ్డి కాపు జాతికోసం అంటూ ప్రగల్భాలు పలికిన పోరాటాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా అని రాష్ట్రంలోని కాపులందరూ నవ్వుకుంటున్నారు.