ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఇరికించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేసి భంగపడిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇప్పుడు సొంత పార్టీలో కూడా విలువ లేదు. జగన్మోహన్ రెడ్డి- ఆళ్లకు కొంచెం విలువ ఇచ్చినా సరే.. ఆయన మరింతగా రెచ్చిపోయి తెలుగుదేశం వారి మీద కేసుల మీద కేసులు వేస్తూనే ఉండేవారని, సొంతపార్టీలో కూడా దిక్కులేకపోవడంతో ఇప్పుడు ఎదురైన భంగపాటును భరించి.. మిన్నకుండిపోతున్నారని పలువురు జాలి వ్యక్తం చేస్తున్నారు. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కిక్కురుమనకపోవడానికి కారణం కూడా ఇదేనని అంటున్నారు.
ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో నిన్నటిదాకా ఒక కీలక నాయకుడిగానే ఉన్నారు. అయినా సరే.. జగన్ ఆయనకు ఏనాడూ ప్రాధాన్యం ఇచ్చింది లేదు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ఆళ్లను గెలిపిస్తే మంత్రిని చేస్తానని మంగళగిరి ప్రజలకు మాట ఇచ్చారే తప్ప తర్వాత పట్టించుకోలేదు. ఆళ్ల మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. రెండోసారి మంత్రిపదవులు పంచినప్పుడు అయినా చాన్సు దక్కుతుందని అనుకున్నారు. మంత్రి పదవి కాదు కదా.. 2024 ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు జగన్!
అలిగిన ఆళ్ల రామక్రిష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. షర్మిల సారథ్యంలోని కాంగ్రెసులో చేరారు. రోజుల వ్యవధిలోనే అటునుంచి మళ్లీ వెనక్కు వచ్చి వైసీపీ కండువానే కప్పుకున్నారు. మంగళగిరిలో పార్టీకోసంపనిచేశారు గానీ.. జగన్ మీద ఉన్న ప్రజావ్యతిరేకత దాదాపుగా అందరినీ ఓడించింది.
పార్టీ నమ్ముకుని ఎన్ని పరాభవాలు ఎదురైనా పడి ఉండేవారికి కూడా విలువ ఇచ్చే అలవాటు లేని జగన్.. పార్టీ మీద అలిగి వెళ్లిపోయి, బయట గత్యంతరం లేక మళ్లీ వెనక్కు వచ్చిన వారికి విలువ ఇస్తారనుకోవడం భ్రమ. ఆ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్లకు ఠికానా లేకుండాపోయింది. కనీసం పార్టీ అయినా తనకు విలువ ఇచ్చి ఉంటే.. ఇప్పుడు సుప్రీంలో ఎదురైన పరాభవానికి విరుగుడుగా.. వేరే ఇతరత్రా ఏదో ఒక అంశాల మీద తెలుగుదేశం వారిని ఇరికించేలా ఆళ్ల రామక్రిష్ణారెడ్డి కేసులు వేసేవారని, ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోతున్నారని అంతా అనుకుంటున్నారు.