వారు కూడా పరారీలోకి వెళ్తారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి, జగన్మోహన్ రెడ్డి అనుయాయులకు, వీరవిధేయులకు తెలిసిన మార్గాలు ఏమిటంటే చాలా సింపుల్‌గా చెప్పవచ్చు. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి విచ్చలవిడిగా ప్రవర్తించడం, అవినీతికి పాల్పడడం, జగన్ పాలనను అడ్డుపెట్టుకుని అరాచకంగా చెలరేగిపోవడం.. తీరా కేసులు నమోదు అయిన తర్వాత.. ముందస్తు బెయిళ్లు కావాలని, అరెస్టు నుంచి రక్షణ కావాలని కోర్టులను ఆశ్రయించడం.. ఆ పాచిక పారనప్పుడు హఠాత్తుగా మాయమై పరారీలోకి వెళ్లిపోవడం మాత్రమే. ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి ఆత్మీయులు పలువురు పరారీలో ఉన్న సంగతి మనకు తెలుసు. అలాగే.. కొందరు పరారయ్యే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయి కటకటాలు లెక్కపెడుతున్న సంగతి కూడా మనకు తెలుసు. అదే క్రమంలో ఇప్పుడు మరో ముగ్గురు ప్రముఖులు కూడా కొన్ని రోజుల పాటూ పరారీలోకి వెళ్లబోతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

దాదాపుగా 3500 కోట్ల రూపాయలు ముడుపులు కాజేసిన ఏపీ లిక్కర్ కుంభకోణంలో గతంలో 30 మంది నిందితులుగా పోలీసు కేసులో నమోదు కాగా.. కొత్తగా జగన్-భారతి దంపతులకు అత్యంత విధేయులు అయిన మరో ముగ్గురు కూడా నిందితుల జాబితాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఎఎస్ ధనంజయరెడ్డి, భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీ ముగ్గురూ కూడా ఇప్పుడు నిందితులు. వీరి ముందస్తు బెయిలు పిటిషన్ ను హైకోర్టు బుధవారం నాడు తిరస్కరించింది. హైకోర్టులో విచారణ జరగకముందే వారు ఇదే విజ్ఞప్తితో సుప్రీంను ఆశ్రయించగా అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది.

హైకోర్టు ముందస్తు బెయిలు పిటిషన్ తిరస్కరించినందున.. ఇదివరలో వేసిన పిటిషన్ ఇప్పుడు విచారణార్హం కాదని ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ చేసిన అభ్యంతరాన్ని పరిగణించిన సుప్రీం ధర్మాసనం వారిని మళ్లీ కొత్త పిటిషన్ వేయాల్సిందిగా చెప్పి 13వ తేదీకి కేసు వాయిదా వేసింది. కనీసం ఆ 13 వ తేదీ వరకు తాము అరెస్టు కాకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని ఆ ముగ్గురూ విన్నవించుకున్నప్పటికీ.. సుప్రీం పట్టించుకోలేదు. ‘మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి’ అని వ్యాఖ్యానిస్తూ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వలేం అని తేల్చేసింది.
లిక్కర్ స్కామ్ లో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి వసూళ్ల నెట్‌వర్క్ కు మూలవిరాట్టు కాగా.. తన నెట్వర్క్ ద్వారా ఆయన పోగేసిన డబ్బు మొత్తాన్ని అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్ తరఫున స్వీకరించిన వ్యక్తులు ఈ ముగ్గురే అని ఇప్పటిదాకా సిట్ విచారణలో వచ్చిన వాంగ్మూలాలను బట్టి తేలుతోంది. తేలిన తర్వాతే వారి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. కాగా, హైకోర్టు ముందస్తు బెయిలు తిరస్కరించింది. వారి పాత్ర గురించిన ఆధారాలు స్పష్టంగా ఉండడంతో వారి అరెస్టుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 13వ తేదీ వాయిదా ఉండగా.. అప్పటిదాకా అరెస్టు నుంచి రక్షణకు సుప్రీం నిరాకరించడంతో.. అరెస్టు కాకుండా ఉండేందుకు వీరు ముగ్గురూ కూడా పరారీలోకి పలాయనమంత్రాన్ని పఠిస్తారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories