సజ్జల కస్టడీ విచారణలో వాస్తవాలు బయటికొస్తాయా?

మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో ఒక కీలక నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడానికి న్యాయస్థానం అనుమతిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురునిందితులను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా కీలక అధికారులు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ధనుజంయరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. గోవిందప్ప బాలాజీ ఏకంగా అరెస్టు అయి రిమాండుకు వెళ్లారు. నేడో రేపో ఆయనను కూడా కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతి కావాలని పోలీసులు అడిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని మూడురోజుల పాటు విచారించనుండడం విశేషం. సజ్జల విచారణ ద్వారా.. ఖచ్చితంగా కొత్త విషయాలు, కొన్ని వాస్తవాలు ఉన్నదున్నట్టుగా వెలుగులోకి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇలా భావించడానికి ఒక కారణం కూడా ఉంది. సజ్జల శ్రీధర్ రెడ్డి కరడుగట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త గానీ, కరడుగట్టిన జగన్ అభిమాని గానీ కాదు. గతంలో ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. జగన్ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. మద్యం పాలసీ మారిన తర్వాత.. అందులో ముడుపులు, వాటాలు కాజేయడానికి బాగా అవకాశం ఉన్నందున అందులోకి రంగప్రవేశం చేశారు. లిక్కర్ కుంభకోణాన్ని నడిపించిన కోటరీ తరఫున మద్యం డిస్టిలరీలతో డీల్ మాట్లాడడమూ, వారిని వాటాలు ఇచ్చేలా ఒప్పించడమూ తదితర వ్యవహారాలన్నీ సజ్జల శ్రీధర్ రెడ్డి నిర్వహించేవారు.

డిస్టిలరీల యజమానులతో హైదరాబాదు కేంద్రంగా ఆయన సమావేశాలు జరుగుతూ ఉండేవి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ప్రయోజనాల మీద ఆశ తప్ప సజ్జల శ్రీధర్ రెడ్డికి మరొక ఆలోచన ఉండకపోవచ్చునని.. అందువల్ల ఆయన వెనకాడకుండా.. లిక్కర్ కుంభకోణంలో వాస్తవంగా ఏం జరిగిందో దాచుకోకుండా చెప్పేస్తారనే అభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది.

ఇప్పటికే రాజ్ కెసిరెడ్డి ని కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా పోలీసులు అనేక వివరాలు సేకరించారు. పార్టీకి భారీగా నిధులు సమకూర్చేవిధంగా లిక్కర్ పాలసీ రూపొందించాలని జగన్ ఆదేశించినందువల్లనే ఆ ప్రకారం కొత్తపాలసీ తయారైనట్టు రాజ్ కెసిరెడ్డి విచారణలో చెప్పారు. ఆ విషయం పోలీసులు రిమాండ్ రిపోర్టులో కూడా పొందుపరిచారు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కస్టడీ విచారణలో పూర్తిగా వాస్తవాలు చెప్పేస్తే గనుక.. ఏయే డిస్టిలరీల పాత్ర ఎంత.. ఎవరెవరికి ఎలాంటి డీల్ తో వాటాలు వసూలు చేశారు, వసూళ్లలో కీలకమైన వ్యక్తులు ఎవరు వంటి సమస్త వివరాలు వెలుగులోకి వస్తాయని అంతా అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories